● ఎమ్మెల్సీ విక్రాంత్
రాజాం: అమరావతి రాజధాని పేరిట చంద్రబాబు ప్రభుత్వం సాగిస్తున్న భూదందాలు, అక్రమాలు అడ్డుకోవడమే వైఎస్సార్‌సీపీ అజెండా అని, అక్కడి రైతులకు అన్యాయం జరిగితే సహించేదిలేదని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ అన్నారు. రాజాంలో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర రాజధానిగా ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వం నిర్ణయించుకుంటుందని, రాజధాని అవ్వకుండా వైఎస్సార్‌సీపీ అడ్డుకుంటోందన్న కూటమినేతల ప్రచారం అనైతికతకు నిదర్శనమన్నారు. 2014–19 మధ్య కాలంలో అమరావతిని రాజధానిగా చేసి, పాలనచేసిన టీడీపీ పదేళ్ల తరువాత మళ్లీ అమరావతి రాజధాని అంటూ తీర్మానాలు చేయడం, పచ్చమీడియాలో తప్పుడు ప్రచారాలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. వంటగ్యాస్ లేక రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, చిన్నచిన్న టిఫిన్, టీ షాపులు, పాస్ట్‌ఫుడ్ సెంటర్లు మూసేశారని, గ్యాస్ డిమాండ్‌పై ప్రభుత్వం చేతకాని తనాన్ని ప్రజలు ప్రశ్నిస్తుంటే ఆ దృష్టిని మళ్లించేందుకు అమరావతిని తెచ్చేశాం అంటూ కూటమి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని మండిపడ్డారు. ప్రజాసంక్షేమం చేతకాని చంద్రబాబుపై రెండేళ్లకే ఓటర్లు అసహనంతో ఉన్నారని, అది హద్దులు దాటకుండా కూటమి జాగ్రత్తగా ఉండాలని హితవుపలికారు.


