యేసు క్రీస్తు త్యాగం విశ్వశాంతికి చిహ్నం | - | Sakshi
Sakshi News home page

యేసు క్రీస్తు త్యాగం విశ్వశాంతికి చిహ్నం

Apr 3 2026 7:08 AM | Updated on Apr 3 2026 7:08 AM

విజయనగరం: యేసు క్రీస్తు ప్రాణత్యాగం విశ్వశాంతికి చిహ్నమని, సర్వ మానవాళి పాప విమోచనం కోసం తన ప్రాణాలను బలిదానంగా అర్పించిన కరుణామయుడు యేసు అని ఉమ్మడి విజయనగరం జెడ్పీ చైర్మన్‌, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) పేర్కొన్నారు. క్రీస్తు ఆరాధకులకు గుడ్‌ఫ్రైడే శుభాకాంక్షలు తెలిపారు. యేసుక్రీస్తు చూపిన త్యాగం, క్షమాగుణం, సహనం, నిస్వార్థ ప్రేమ ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని కొనియాడారు. శత్రువులను సైతం ప్రేమించాలని, పీడిత ప్రజల పట్ల కరుణ చూపాలనే క్రీస్తు బోధించిన సందేశం, ఆచరించిన జీవితం విశ్వమానవాళికి మార్గదర్శకమని పేర్కొన్నారు. సమాజంలో కూడా అటువంటి శాంతి, సోదరభావం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. క్రీస్తు చూపిన సేవా మార్గంలోనే ప్రస్తుత ప్రభుత్వాలు కూడా నిరుపేదల సంక్షేమంకోసం కృషిచేయాలన్నారు. ప్రజలందరిపైనా క్రీస్తు దీవెనలు ఉండాలన్నారు.

మట్టి అక్రమ రవాణాపై చర్యలు తప్పవు

రామభద్రపురం: మట్టి అక్రమ తవ్వకాలు, రవాణా చేసేవారిపై చర్యలు తీసుకుంటామని తహసీల్దార్‌ అజురఫీజాన్‌, ఎస్‌ఐ వి. ప్రసాద రావు హెచ్చరించారు. పదిరోజులుగా మండలంలో రాత్రింబవళ్లు మట్టి అక్రమ తరలింపు యథేచ్ఛగా సాగుతున్నాయని ఫిర్యాదు వచ్చిందని, తక్షణమే నిలుపుదల చేయాలని జేసీబీ, ట్రాక్టర్‌ యజమానులకు సూచించారు. తహసీల్దార్‌ కార్యాలయంలో మైన్స్‌ అధికారులు, వీఆర్వోలు, సచివాలయ సర్వేయర్లు, ట్రాక్టర్‌, జేసీబీ యజమానులతో సమావేశం ఏర్పాటుచేశారు. అక్రమ తవ్వకాలను నియంత్రించాలని అధికారులకు తహసీల్దార్‌ సూచించారు. పొలాలకు మట్టి వేసుకునే రైతులకు ఎలాంటి ఇబ్బందులు పెట్టొద్దన్నారు.

సిబ్బందికి ప్రశంసలు

విజయనగరం క్రైమ్‌: గతేడాది విజయనగరం టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నమోదైన హత్యకేసులో నిందితుడు గాజులరేగకు చెందిన కర్నపుసాయి (20)కి శిక్షపడేలా అభియోగపత్రాలు దాఖలు చేసిన, సాక్షులను ప్రవేశపెట్టిన విజయనగరం టూటౌన్‌ సీఐ టి.శ్రీనివాసరావు, ఏఎస్‌ఐ జి.అర్జున్‌, మహిళా కానిస్టేబుల్‌ టి.లక్ష్మిని ఎస్పీ ఎ.ఆర్‌.దామోదర్‌ గురువారం తన కార్యాలయంలో ప్రత్యేకంగా అభినందించారు. ప్రశంసాపత్రాలు అందజేశారు. నేరానికి పాల్పడిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement