రైతన్నకు దన్నేది..? | - | Sakshi
Sakshi News home page

రైతన్నకు దన్నేది..?

Feb 5 2026 7:13 AM | Updated on Feb 5 2026 7:13 AM

రైతన్

రైతన్నకు దన్నేది..?

అగ్రి టెస్టింగ్‌ ల్యాబ్‌లో ఏర్పాటు చేసిన విత్తన పరీక్ష పరికరాలు

విజయనగరం ఫోర్ట్‌:

రైతులకు ఉపయోగపడే అగ్రిల్యాబ్‌లు నిర్వీర్యమవుతున్నాయా అంటే... జిల్లాలో అవుననే సమాధానం వినిపిస్తోంది. జిల్లాలో ఉన్న ఏడు అగ్రిల్యాబ్‌లలో జిల్లాస్థాయి ల్యాబ్‌ను ఇంకా అందుబాటులోకి తేకపోవడం.. మరోవైపు సారిక, గజపతినగరంలోని ల్యాబ్‌లలో విత్తన, ఎరువుల పరీక్షలు నిలిచిపోవడం రైతన్నను ఆందోళనకు గురిచేస్తున్నాయి. సాగుకు దన్నుగా ఉండే ల్యాబ్‌లపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వ్యవసాయంపై చంద్రబాబు ప్రభుత్వం చిన్నచూపుచూస్తోందని, రైతుసేవా కేంద్రాల్లో గతంలో వలే సాగు సేవలు అందడంలేదని, ఉచిత పంటల బీమా పథకానికి మంగళం పాడేసిందని, విపత్తుల సమయంలో పరిహారం అందడంలేదని, పెట్టుబడి సాయం కూడా సకాలంలో అందని పరిస్థితి నెలకొందంటూ రైతులు వాపోతున్నారు. వ్యవసాయం దండగన్న ధోరణిలో యూరియా కూడా అందించడంలేదని ఆవేదన చెందుతున్నారు. ఇప్పుడు అగ్రిల్యాబ్‌లను కుదించి సేవలను అందని ద్రాక్షగా మార్చుతోందని ఆరోపిస్తున్నారు.

రైతులకు ఉపయోగకరం...

రాష్ట్రంలోని తిరుపతి, తాడేపల్లి గూడెం, అమరావతి, విశాఖపట్నంలో ఉన్న రీజనల్‌ కోడింగ్‌ సెంటర్స్‌ నుంచి జిల్లాలోని అగ్రి టెస్టింగ్‌ ల్యాబ్‌లకు విత్తనాలు, ఎరువులు, పురుగు మందులకు సంబంధించి శాంపిల్స్‌ వస్తాయి. వీటిని పరీక్షలు చేసిన తర్వాత వాటి ఫలితాలను ఆన్‌లైన్లో సంబంధిత వ్యవసాయ శాఖ కార్యాలయానికి పంపిస్తారు. విత్తనాలకు సంబంధించి మొలక శాతం, తేమశాతం, ప్యూరిటీ పరీక్షలు, ఎరువులకు సంబంధించి ఎరువు బస్తాపై తెలిపిన విధంగా నత్రజని, పొటాష్‌, పాస్పరస్‌, ప్రీపాస్పరిక్‌ యాసిడ్స్‌ ఉన్నాయో లేదో పరీక్షిస్తారు. జిల్లాలో ఉన్న రైతులు తమ సమీపంలోని ల్యాబ్‌లను నేరుగా శాంపిల్స్‌ను తీసుకెళ్లి పరీక్షలు చేయించుకోవచ్చు. భూ సార పరీక్షల ఫలితాలను తెలుసుకోవచ్చు.

ల్యాబ్‌లను కుదించే యత్నం..

జిల్లాలో ఉన్న అగ్రి టెస్టింగ్‌ ల్యాబ్‌లను చంద్రబాబు ప్రభుత్వం కుదించే ప్రయత్నం చేస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. విజయనగరం నియోజకవర్గం పరిధిలోని సారిక గ్రామంలో ఉన్న నియోజకవర్గ స్థాయి అగ్రి టెస్టింగ్‌ ల్యాబ్‌ను, చీపురుపల్లిలో ఉన్న అగ్రి టెస్టింగ్‌ ల్యాబ్‌లలో సేవలు నిలిచిపోయినట్టు సమాచారం. విత్తనాలు, ఎరువులకు సంబంధించిన పరీక్షలు కూడా నిలిపివేయడంపై రైతులు ఆవేదన చెందుతున్నారు. నెలివాడ వద్ద నిర్మించిన జిల్లాస్థాయి ల్యాబ్‌ను అందుబాటులోకి తేవడంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని రైతులు ప్రశ్నిస్తున్నా ఫలితం కనిపించడం లేదు.

రైతులకు ఉపయోగపడే ల్యాబ్‌ల

నిర్వహణపై ప్రభుత్వం కినుక

నిర్వీర్యంచేసే ఎత్తుగడ

జిల్లాలో ఏడు అగ్రి ల్యాబ్‌లు

ఇప్పటికీ అందుబాటులోకి రాని జిల్లాస్థాయి ల్యాబ్‌

గత ప్రభుత్వ హయాంలో ఒక్కోల్యాబ్‌ రూ.62 లక్షలతో నిర్మాణం

పరికరాలకు మరో రూ.60 లక్షల

వరకు ఖర్చు

సాగుకు భరోసాగా ల్యాబ్‌ల ఏర్పాటు

ల్యాబ్‌లను తగ్గించాలని ఆదేశాలొచ్చాయి...

జిల్లాలో ఆరు నియోజకవర్గ స్థాయి, ఒకటి జిల్లా స్థాయి అగ్రిటెస్టింగ్‌ ల్యాబ్‌లు ఉన్నాయి. నెలివాడ వద్ద ఉన్న జిల్లా స్థాయి ల్యాబ్‌ ఇంకా ప్రారంభించలేదు. ఈ ఖరీఫ్‌ సీజన్‌కు అందుబాటులో తెచ్చేందుకు చర్యలు తీసుకుంటాం. కొన్ని నియోజకవర్గ స్థాయి ల్యాబ్‌లను తగ్గించాలని ఆదేశాలు వచ్చాయి.

– వి.తారకరామారావు,

జిల్లా వ్యవసాయ అధికారి

రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, భూసార పరీక్ష ఫలితాలు అందించి వారికి అన్నివిధలా అండగా నిలవాలనే గొప్ప సంకల్పంతో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నియోజకవర్గానికో అగ్రిల్యాబ్‌లను ఏర్పాటు చేసింది. విజయనగరం, చీపురుపల్లి, నెల్లిమర్ల, రాజాం, బొబ్బిలి, కొత్తవలసల్లో నియోజకవర్గ స్థాయి అగ్రి టెస్టింగ్‌ ల్యాబ్‌లు ఏర్పాటు చేయగా, గజపతినగరం నియోజకవర్గంలోని బొండపల్లి మండలం నెలివాడ వద్ద జిల్లా స్థాయి అగ్రిల్యాబ్‌ను నిర్మించింది. ఒక్కోల్యాబ్‌ ఏర్పాటుకు రూ.62 లక్షలు వెచ్చించించింది. మరో రూ.60 లక్షల వరకు వెచ్చించి పరికరాలు సమకూర్చింది. సాగును లాభసాటిగా మార్చడంలో అగ్రిల్యాబ్‌లు రైతుకు దన్నుగా నిలవాలన్నది ప్రధాన లక్ష్యం. సకాలంలో భూ పరీక్ష ఫలితాలు అందడం వల్ల నేలకు తగ్గట్టుగా పంటలు పండించేందుకు... భూ లోపాలను సరిచేసుకునేందుకు రైతుకు అవకాశం కలుగుతుంది. అధిక దిగుబడుల సాధనకు వీలుకలుగుతుంది. నాణ్యమైన విత్తనాలు, ఎరువులను వినియోగించుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇంతటి ప్రయోజనం ఉన్న అగ్రిల్యాబ్‌ల పట్ల చంద్రబాబు సర్కార్‌ నిర్లక్ష్యం చేస్తుందని రైతులు వాపోతున్నారు. అగ్రిటెస్టింగ్‌ ల్యాబ్‌లను పట్టించుకోవడం మానేసిందని రైతులు ఆరోపిస్తున్నారు.

రైతన్నకు దన్నేది..? 1
1/2

రైతన్నకు దన్నేది..?

రైతన్నకు దన్నేది..? 2
2/2

రైతన్నకు దన్నేది..?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement