ప్రాణాలు పోతున్నా లెక్కలేని తనం
● కేన్సర్ రోగులకు ద్రోహం చేసిన టీడీపీ ప్రభుత్వం
● యువగళం హామీలు మరిచిన నారాలోకేశ్
● తక్షణమే ఆస్పత్రిని నిర్మించాలని డిమాండ్
విజయనగరం గంటస్తంభం: శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాలో కేన్సర్ రోగుల సంఖ్య పెరుగుతోందని, వైద్యం అందక అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నా ప్రభుత్వానికి లేక్కేలేదని లోక్‌సత్తా పార్టీ అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే కేన్సర్‌కు వైద్యం అందించేలా ఆస్పత్రిని ఏర్పాటుచేయాలని డిమాండ్ చేశారు. ప్రపంచ కేన్సర్ అవగాహన దినోత్సవం సందర్భంగా జిల్లా పౌరవేదిక, ప్రభుత్వ కేన్సర్ ఆస్పత్రి సాధనసమితి ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ విగ్రహం వద్ద ప్రజాసంఘాలతో కలిసి బుధవారం శాంతియుత నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా భీశెట్టి మాట్లాడుతూ... రాష్ట్రంలో ఏటా లక్షలాది కేన్సర్ కేసులు నమోదవుతున్నాయని, అందులో విజయనగరం జిల్లా అగ్రస్థానంలో ఉందన్నారు. మహిళల్లో గర్భాశయ, రొమ్ము కేన్సర్‌లు, యువతలో గొంతు, బ్లడ్ కేన్సర్‌లు పెరిగి కుటుంబాలను ఆర్థికంగా నాశనం చేస్తున్నాయని తెలిపారు. అధికారంలోకి వచ్చిన వెంటనే జిల్లాకు ప్రభుత్వ కేన్సర్ ఆస్పత్రి మంజూరు చేస్తామని యువగళం పాదయాత్రలో చంద్రబాబు తనయుడు, మంత్రి నారాలోకేశ్ ఇచ్చిన హామీ ఇప్పటివరకు అమలుకాలేదని విమర్మించారు. ప్రజల ప్రాణాలపై నిర్లక్ష్యం చేయడం తగదని, జిల్లాకు ప్రభుత్వ కేన్సర్ ఆస్పత్రిని మంజూరుచేయాలని డిమాండ్ చేశారు.


