అణువణువూ గాలింపు
● అద్దె ఇల్లు, లాడ్జిల్లో ఆరా..
● జీఎంఆర్‌ఐటీ పరిసర ప్రాంతాల్లో
కార్మికుల వివరాలు సేకరణ
రాజాం: జీఎంఆర్‌ఐటీ క్వార్టర్స్‌లో జరిగిన భారీచోరీ పోలీసులకు సవాల్‌గా మారింది. ఓ డాక్టర్, మరో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇళ్లలో నాలుగురోజుల కిందట దొంగలు చొరబడి సుమారు కేజీన్నర బంగారం, కిలో వెండిని దోచుకుపోయిన ఘటన తెలిసిందే. క్వార్టర్స్‌లోని ఓ సీసీ కెమెరాలో కనిపించిన ఆనవాళ్లు మినహా ఎక్కడా ఎటువంటి జాడ లేకుండా దొంగలు జాగ్రత్తపడ్డారు. ఈ దొంగతనాన్ని ఛేదించే పనిలో జిల్లా పోలీస్ యంత్రాంగం నిమగ్నమైంది. సంఘటనా స్థలంలో లభించిన చిన్నచిన్న ఆధారాలతో పాటు అనుమానిత వ్యక్తులు, గతంలో ఇటువంటి చోరీలు జరిగిన ప్రదేశాల్లో పట్టుబడిన దొంగలు, రాజాం పరిసర ప్రాంతాల్లో దొంగతనాలకు సంబంధించిన నేరస్తుల వివరాలపై పోలీసులు దృష్టిసారించారు. బృందాలుగా ఏర్పడి అనుమానిత వ్యక్తులు, ప్రాంతాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
పనులకు వచ్చేవారి వివరాల సేకరణ..
జీఎంఆర్‌ఐటీ క్వార్టర్స్‌లో పనిచేసే కార్మికుల వివరాలు, వారి బంధువుల వివరాలతో పాటు క్వార్టర్స్‌లో నివాసముంటున్న ఉద్యోగుల వివరాలు మొత్తం పోలీసులు తీసుకున్నారు. ఐటీ క్వార్టర్స్‌లోకి ఇతర వ్యక్తుల రాకపోకలను అక్కడి సెక్యూరిటీ నిషేధించింది. ఆయా క్వార్టర్స్‌లోకి ఉదయం వచ్చి వెళ్లే వారి వివరాలతో పాటు ఐటీలో భవనాలు మరమ్మతులు, నిర్మాణాల్లో పనిచేస్తున్న కార్మికుల వివరాలు నమోదుచేస్తున్నారు. మరోవైపు చీపురుపల్లి డీఎస్పీ ఎస్.రాఘవులతో పాటు రాజాం రూరల్ సీఐ ఉపేంద్రలు సంఘటనకు సంబంధించి బాధితులు నుంచి మరిన్ని వివరాలు సేకరించడంతో పాటు మరోమారు ఆయా ప్రాంతాలను పరిశీలించారు. చోరీకి పాల్పడిన దొంగలను పట్టుకుని బాధితులకు న్యాయం చేసేదిశగా ముమ్మర చర్యలు చేపట్టినట్టు డీఎస్పీ వెల్లడించారు.
అద్దె ఇల్లు,
లాడ్జిల్లో వివరాల
పరిశీలన
రాజాంతో పాటు పరిసర గ్రామాల్లో రెంటెడ్ హౌస్‌ల వివరాలను పోలీసులు బుధవారం సేకరించారు. ఇప్పటివరకూ అద్దెకు ఉండి ఆకస్మికంగా ఖాళీ చేసినవారి వివరాలు, దూర ప్రాంతాల నుంచి ఇక్కడకు వివిధ పనుల నిమిత్తం వచ్చి అద్దెకు ఉంటున్నవారి వివరాలు సేకరిస్తున్నారు. రాజాం పట్టణంలోని పలు లాడ్జిల్లో గత కొద్ది రోజులుగా మకాంవేసి, ఖాళీ చేసిన వారి వివరాలపై ఆరా తీస్తున్నారు. అనుమానిత ప్రాంతాల్లో వాహన తనిఖీలు, వాహనచోదకుల వివరాలపై ఆరాతీస్తున్నారు.


