ప్రశ్నించే వారిపై కక్ష సాధింపులా...?
విజయనగరం: ఎన్నికలకు ముందు హమీలు గుప్పించి అధికారంలోకి వచ్చిన తరువాత వాటిని అమలు చేయాలని ప్రశ్నించిన విద్యార్థి, యువజన సంఘాలపై రౌడీషీట్లు తెరవడం చంద్రబాబు ప్రభుత్వానికి తగదంటూ విద్యార్థి, యువజన సంఘాల ఐక్యకార్యాచరణ కమిటీ మండిపడింది. విజయనగరం జిల్లా కేంద్రంలోని బాలాజీ కూడలి వద్ద వైఎస్సార్‌సీపీ యువజన, విద్యార్థి విభాగాలతో పాటు ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐవైఎఫ్, ఏఐఎస్‌ఎఫ్ తదితర సంఘాల ఆధ్వర్యంలో చంద్రబాబు ప్రభుత్వ నిరంకుశ పాలనను వ్యతిరేకిస్తూ విద్యార్థులు నల్లబ్యాడ్జీలతో ధర్నా చేశారు. ముందుగా బాలాజీ కూడలిలోని బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం చేస్తున్న కక్ష సాధింపు చర్యలు విరమించుకోవాలని కోరుతూ వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు అల్లు అవినాష్, నాయకులు జి.ఈశ్వర్‌కౌశిక్, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగభూషణం, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు వాసు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు జగదీష్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజలకు కల్పించాల్సిన హక్కులపై ప్రశ్నిస్తే అక్రమంగా కేసులుపెట్టడం, రౌడీషీట్లు నమోదుచేయడం దుర్మార్గమన్నారు. ప్రభుత్వ చర్యలను ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి, యువజన సంఘాల ఐక్యకార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో నిరసనలు చేపడతామన్నారు. విద్యార్థులకు చెల్లించాల్సిన రూ.6,400 కోట్ల ఫీజురీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను విడుదలలో ప్రభుత్వ తాత్సారంపై మండిపడ్డారు. పేద ప్రజలకు మెరుగైన వైద్యం, విద్యార్థులకు వైద్య విద్య అందించాలనే సంకల్పంతో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. ప్రభుత్వానికి ప్రజలు అధికారం ఇచ్చింది కేవలం ఐదేళ్లు మాత్రమేనని, 30 సంవత్సరాల పాటు ప్రైవేటుకు లీజుకు ఇవ్వడం దారుణమ ని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యారంగ సమస్యలు, జాబ్ కార్డు విడుదల చేయాలని డిమాండ్‌చేస్తే కక్ష సాధింపు చర్యలకు దిగడం బాధాకరమన్నారు. విద్యార్థి, యువజన సంఘాల నాయకులు ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లోకి వెళ్లకూడదంటూ విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ ఆదేశాలు జారీచేయడం హేయమైన చర్యగా పేర్కొన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్నా విద్యా ర్థులు, యువతకు ఇచ్చిన హమీల అమలులో నిర్లక్ష్యం చేయడం దారుణమన్నారు. నిరుద్యోగభృతి ఎప్పుడు చెల్లిస్తారో చెప్పాలనానరు. ప్రభుత్వం స్పందించి సమస్యలు పరిష్కరించుకుంటే గద్దె దింపేలా పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు కరుమజ్జి సాయికుమార్, పలు సంఘాల నాయకులు పాల్గొన్నారు.
హమీల అమలుకోసం ప్రభుత్వం
మెడలు వంచుతాం
విద్యార్థులు, యువతపై పెట్టిన రౌడీషీట్లు ఎత్తివేయాలి
రూ.6,400 కోట్ల ఫీజురీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలి
ప్రభుత్వ మెడికల్ కాలేజీల
ప్రైవేటీకరణను విరమించుకోవాలి
విద్యార్థి, యువజన సంఘాల
ఐక్యకార్యాచరణ కమిటీ డిమాండ్
అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం
అందజేత
ప్రశ్నించే వారిపై కక్ష సాధింపులా...?


