సమస్యలు తెలుసుకున్నాం.. పరిష్కరిస్తాం
● గిరిజన ప్రజలకు హామీ ఇచ్చిన
జిల్లా అధికారులు
బొబ్బిలి/ బొబ్బిలి రూరల్: మండలంలోని గోపాలరాయుడు పేట పంచాయతీ సమీపంలోని అన్ని గిరిజన గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని జిల్లా అధికారులు పేర్కొన్నారు. ‘వసతులు లేని ఈ బతుకులెందుకు’ శీర్షికన సాక్షి దినపత్రికలో శుక్రవారం ప్రచురితమైన కథనానికి యంత్రాంగం స్పందించింది. జిల్లా పంచాయతీ అధికారి మల్లిఖార్జునరావు నేతృత్వంలో ఆర్డీఓ రామ్మోహనరావు, డీడీఓ కిరణ్ కుమార్, ఇతర శాఖల అధికారులు కృపావలస గ్రామంలో శుక్రవారం పర్యటించి గ్రామసభ నిర్వహించారు. రేషన్, ఆధార్ కార్డులు ఉన్నా.. అవి సాలూరు, మక్కువ మండలాల పరిధిలో ఉన్నా యని ప్రజలు వివరించారు. తాగునీరు, విద్యుత్, రోడ్లు, అంగన్‌వాడీ కేంద్రాలు ఏర్పాటు చేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. రేషన్, ఆధార్ కార్డులు లేని వారికి సచివాలయ సిబ్బందితో సర్వే నిర్వహించి అందిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఎం.శ్రీను, ఎంపీడీఓ పి.రవికుమార్, డీఆర్‌ఓ వెంకరాజగోపాల్, పీఆర్‌జేఈ రాజశేఖర్ పాల్గొన్నారు.
సమస్యలు తెలుసుకున్నాం.. పరిష్కరిస్తాం


