ఒక జిల్లా ఒక ఉత్పత్తిగా మామిడి తాండ్ర
● కలెక్టర్ రాంసుందర్ రెడ్డి
విజయనగరం ఫోర్ట్/విజయనగరం అర్బన్: ఒక జిల్లా ఒక ఉత్పత్తిగా జిల్లా నుంచి మామిడి తాండ్రను ఎంపిక చేసినట్టు కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి తెలిపారు. కలెక్టరేట్‌లో ఉద్యానశాఖ అధికారులతో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎల్.కోట మండలం భీమాళి వద్ద తయారయ్యే మామిడి తాండ్ర ఇప్పటికే ఎంతో ప్రసిద్ధి పొందిందన్నారు. ఈ ప్రాంతం నుంచి ఢిల్లీ, హైదరాబాద్ వంటి ప్రదేశాల్లో ఉండే స్నేహితులకు భీమాలి మామిడితాండ్రను బహూకరిస్తున్నారన్నారు. మామిడితాండ్ర తయారీ, ప్యాకింగ్, మార్కెటింగ్‌కు ఆధునికతను జోడించేందుకు సమగ్ర ప్రణాళికను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో జేసీ సేతుమాధవన్, ఉద్యానశాఖ డీడీ చిట్టిబాబు, డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాసపాణి, మెప్మా పీడీ చిట్టిరాజు, చేనేత జౌళిశాఖ ఏడీ మురళీకృష్ణ, విద్యుత్‌శాఖ ఎస్‌ఈ మువ్వల లక్ష్మణరావు, తదితరులు పాల్గొన్నారు.
భూసేకరణ వేగవంతం చేయాలి
ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుకు సంబంధించిన భూ సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో భూసేకరణపై రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీని వేగవంతంగా పూర్తిచేయాలని ఆదేశించారు.
● జిల్లాలోని అన్ని గ్రామాలను నిర్దేశించిన సమయానికి వంద శాతం బహిరంగ మలవిసర్జన రహిత (ఓడీఎఫ్) గ్రామాలుగా ప్రకటించాలని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులను వీడియోకాన్ఫరెన్స్‌లో కలెక్టర్ ఆదేశించారు.
● పీహెచ్‌సీల్లో వైద్య సేవలు మెరుగుపడాలని, ఓపీని సగటున రోజుకి 50కి పెంచాలని వైద్యాధికారులకు కలెక్టర్ సూచించారు. ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డులను ప్రతిరోజూ ఆప్‌డేట్ చేయాలని సూచించారు.


