ఉద్యాన పంటల సాగుతో నిరంతర ఆదాయం
బాడంగి: ఉద్యాన పంటల సాగుతో రైతులకు నిరంతర ఆదాయం వస్తుందని, జిల్లాలో ఖరీఫ్, రబీ సీజన్‌లలో 10వేల ఎకరాల్లో సాగు లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని డీఆర్‌డీడీఏ ఏపీడీ డి.రత్నకుమార్ తెలిపారు. వెలుగు సమావేశ భవనంలో శుక్రవారం నిర్వహించిన ఎంఎస్‌కే కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఆయిల్‌పామ్, పండ్ల తోటల పెంపకంపై ఎక్కువ దృష్టి పెడుతున్నామన్నారు. దీనికోసం ఇప్పటికే 600 మంది ఆదర్శ మహిళా రైతులను గుర్తించామని తెలిపారు. కర్షకులకు నిరంతరం ఆదాయాన్ని తెచ్చిపెట్టే పంటలు సాగు చేయా లని సూచించారు. గ్రామాల్లో మోడల్ ఫార్మర్స్‌గా.. తొలుత వీఓఏల నుంచి మహిళా రైతులను గుర్తిస్తున్నామన్నారు. సమావేశంలో ఏపీఎం.రత్నకుమార్, విజయనగరం వన్‌స్టాప్ సెంటర్ ఉద్యోగి టి.అరుణ, ఎంఎస్‌కే అధ్యక్షు లు, మెంబర్లు, సీసీలు, వీఓఏలు పాల్గొన్నారు.
నేడు సంప్రదాయ క్రీడా పోటీలు
● జిల్లా క్రీడాభివృద్ధి అధికారి
ఎస్.వెంకటేశ్వరరావు
విజయనగరం: సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 10వ తేదీన సంప్రదాయ క్రీడా పోటీలు నిర్వహించనున్నట్టు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎస్.వెంకటేశ్వరరావు తెలిపారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆదేశాల మేరకు విజయనగరం జిల్లా కేంద్రంలోని రాజీవ్ క్రీడామైదానంలో పోటీలు నిర్వహిస్తామన్నారు. ఓపెన్ కేటగిరీలో పురుషులు, మహిళలకు టాగ్‌ఆఫ్‌వార్, కర్రసాము పోటీలు, పురుషులకు ఏడు పెంకులాట, గాలిపటాలు ఎగరవేయడం, మహిళలకు స్కిప్పింగ్, తొక్కుడు బిల్ల, కోలాటం పోటీలు నిర్వహిస్తామని వివరించారు. పోటీలను జేసీ సేతుమాధవన్ ఉదయం 9 గంటలకు ప్రారంభిస్తారని, ఆసక్తి గల వారు తమ పేర్లను ముందుగా నమోదు చేసుకోవాలని సూచించారు. పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు ప్రదానం చేస్తామన్నారు.
ఉపాధ్యాయుడు సస్పెన్షన్
రాజాం సిటీ: విద్యార్థినులపై వక్రబుద్ధి ప్రదర్శించిన రాజాం సమీపంలోని డోలపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సైన్స్ ఉపాధ్యాయుడు డి.ఆశయ్య (ఆశీర్వాదం)ను సస్పెండ్ చేస్తూ డీఈఓ మాణిక్యంనాయుడు శుక్రవారం ఆదేశాలు జారీచేశారు. మండల విద్యాశాఖాధికారులు అందించిన నివేదికల ప్రాప్తికి డీఈఓ చర్యలు తీసుకున్నట్టు ఎంఈఓ ప్రవీణ్‌కుమార్ తెలిపారు.
ఈసీహెచ్‌ఎస్ ఏర్పాటుకు వినతి
బొబ్బిలి: బొబ్బిలిలో ఈసీహెచ్‌ఎస్ ఆస్పత్రి ఏర్పాటుకు సహకరించాలని రాష్ట్ర సైనిక సంక్షేమాధికారి, బ్రిగేడియర్ వెంకటరెడ్డిని స్థానిక మాజీ సైనికులు కోరారు. పార్వతీపురం పర్యటనలో ఉన్న ఆయనను పట్టణంలోని ఫ్‌లై ఓవర్ వద్ద శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. మాజీ సైనికులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. సీఎస్‌డీ క్యాంటీన్ కోసం విశాఖకు వెళ్లాల్సి వస్తోందని, జిల్లా కేంద్రంలో అందుబాటులో ఉండేలా చొరవ చూపాలన్నారు. కార్యక్రమంలో అధ్యక్షుడు రేవళ్ల కిరణ్‌కుమార్, గౌరవాధ్యక్షుడు మరడ రామినాయుడు, ఉపాధ్యక్షుడు రెడ్డి రామకృష్ణ, కార్యదర్శి ఎ.గోవిందనాయుడు పాల్గొన్నారు.
ఉద్యాన పంటల సాగుతో నిరంతర ఆదాయం
ఉద్యాన పంటల సాగుతో నిరంతర ఆదాయం


