ఎరువు ధరవు..!
రైతన్నపై
ఎరువులు కొనుగోలు చేసేదెలా?
విజయనగరం ఫోర్ట్:
ఆరుగాలం శ్రమించి అందరికీ అన్నంపెట్టే రైతన్నకు కష్టకాలం దాపురించింది. ఓ వైపు ప్రకృతి సహకరించక.. మరోవైపు ప్రభుత్వం నుంచి సాగుసాయం పూర్తి స్థాయిలో అందక, పంటలు కొనుగోలుచేసేవారు లేక నలిగిపోతున్నారు. యూరియా సకాలంలో లభించక ఆందోళన చెందుతున్నారు. ఆర్‌ఎస్‌కేలు, ప్రైవేటు దుకాణాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఈ సమయంలో ప్రభుత్వం కాంప్లెక్స్ ఎరువుల ధరలు పెంచి మరింత భారం మోపడంపై ఆందోళన చెందుతున్నారు. ఈ ధరల భారం మోయలేమంటూ నిట్టూర్చుతున్నారు. ఇప్పటికే కూలీలు, విత్తనాలు, పురుగుమందుల ధరలు అమాంతం పెరిగాయని, సాగు కష్టమవుతున్న తరుణంలో కాంప్లెక్స్ ఎరువులపై బస్తాకు రూ.100 నుంచి రూ.200 పెంచడంపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
పెరిగిన కాంప్లెక్సు ఎరువుల ధరలు
బస్తాకు రూ.100 నుంచి రూ.200 వరకు
పెరుగుదల
ఇప్పటికే పెరిగిన ధరలతో ఎరువులు కొనలేని పరిస్థితి
అందుబాటులో లేని యూరియా
జిల్లాలో అధికశాతం మంది వ్యవసాయంపైనే అధారపడి జీవిస్తున్నారు. ఇప్పటికే ఎరువుల ధరలు అధికంగా ఉండడం వల్ల రైతులు కొనుగోలు చేయలేని పరిస్థితి. యూరియా మినహా మిగిలిన అన్ని రకాల కాంప్లెక్స్ ఎరువులు కొనుగోలు చేయలేనంత దూరంలో ఉన్నాయన్నది రైతుల మాట. జిల్లాలోని రైతులు యూరియా, డీఏపీ, పొటాష్ తర్వాత అధికంగా కాంప్లెక్సు ఎరువులను వినియోగిస్తారు. ఏప్రిల్ నుంచి అక్టోబర్ నెలఖారు వరకు యూరియా 31,046 మెట్రిక్ టన్నులు వినియోగం అయ్యింది. అదేవిధంగా డీఏపీ 12,120 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్సు ఎరువులు 9,660 మెట్రిక్ టన్నులు వినియోగించారు. ఇప్పుడు కాంప్లెక్సు ఎరువుల ధరను కూడా ప్రభుత్వం పెంచడంతో రైతులు ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది.
ఎరువు ధరవు..!


