విమానాశ్రయ అభివృద్ధి మాటలన్నీ అబద్ధాలే
● సీపీఎం జిల్లా కార్యదర్మి తమ్మినేని సూర్యనారాయణ
విజయనగరం గంటస్తంభం: భోగాపురం విమానాశ్రయంలో విమానం ట్రయల్‌రన్ జరిపి ఈ ప్రాంతమంతా అభివృద్ధి జరిగిపోయిందంటూ కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ప్రకటించడం విడ్డూరంగా ఉందని సీపీఎం జిల్లా కార్యదర్మి తమ్మినేని సూర్యనారాయణ అన్నారు. నేతల మాటలన్నీ అబద్ధాలుగా పేర్కొన్నారు. విజయనగరంలోని ఎల్‌బీజీ భవన్ లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విమానాశ్రయంలో స్థానికులకు ఎంతమందికి ఉపాధి కల్పిస్తారో మంత్రి రామ్మోహన్‌నాయుడు వెల్లడించాలని డిమాండ్ చేశారు. భూములిచ్చిన రైతులు, స్థానికులకు కనీసం విమానాశ్రయంలోకి అడుగుపెట్టే హక్కు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. జిల్లాలోని జూట్, ఫెర్రో అల్లాయీస్, సుగర్ పరిశ్రమలు మూతపడి యువత ఉద్యోగాలు కోల్పోయినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం విచారకరమన్నారు. జిల్లాలోని భూములన్నీ క్లస్టర్ల పేరుతో కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం పూనుకుందని, రైతులను నిరాశ్రయులుగా మార్చుతోందని వాపోయారు. దీనిపై పోరుబాట సాగిస్తామని స్పష్టంచేశారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు టి.వి.రమణ, వి.లక్ష్మి పాల్గొన్నారు.


