యూత్ ఏషియన్ పారా గేమ్స్‌లో గోల్డ్ మెడల్
విజయనగరం: దుబాయ్ వేదికగా జరుగుతున్న యూత్ ఏషియన్ పారా గేమ్స్ 2025 పారా బాడ్మింటన్‌లో విజయనగరం జిల్లా క్రీడాకారుడు పొట్నూరు ప్రేమ్ చంద్ గోల్డ్ మెడల్ సాధించడం జిల్లాకు గర్వకారణమని పారా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు కె.దయానంద్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన మాట్లాడుతూ జిల్లా స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు విజయాలు సాధించడం వెనుక ప్రేమ్ చంద్ సంకల్పం, నిరంతర సాధనతో పాటు పారా స్పోర్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గోనుగుంట్ల కోటేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి వి.రామస్వామి అందించిన ప్రోత్సాహం ఉన్నాయన్నారు. ఈ నెల 7 నుంచి 14 వరకు దుబాయ్‌లో జరుగుతున్న యూత్ ఏషియన్ పారా గేమ్స్‌లో గతం కంటే పోటీ తీవ్రంగా ఉన్నప్పటికీ బాడ్మింటన్ ఎస్.హెచ్ 6 కేటగిరిలో గోల్డ్ మెడల్ సాధించి జిల్లా పేరును అంతర్జాతీయ స్థాయిలో మారు మోగేలా చేశాడని ప్రశంసించారు. పొట్నూరు ప్రేమ్ చంద్ విజయం పట్ల మంత్రి కొండపల్లి శ్రీనివాస్, కలెక్టర్ రాం సుందర రెడ్డి, జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎస్. వెంకటేశ్వర రావులు అభినందనలు తెలియజేశారు.


