రోగులను ఇబ్బంది పెట్టొద్దు | - | Sakshi
Sakshi News home page

రోగులను ఇబ్బంది పెట్టొద్దు

Mar 11 2026 9:01 AM | Updated on Mar 11 2026 9:01 AM

విజయనగరం ఫోర్ట్‌: ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో వైద్యం కోసం వచ్చే రోగులు ఇబ్బందులు పడకుండా సిబ్బంది చర్యలు తీసుకోవాలని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర అల్లు పద్మజ ఆదేశించారు. ఈసీజీ, స్కానింగ్‌, ఇతర వైద్య పరీక్షలకు రోగులను వీల్‌చైర్లలో తీసుకెళ్లేందుకు వారి బంధువులు పడుతున్న ఇబ్బందులపై ఈ నెల 6వ తేదీన ‘వైద్యం కోసం ‘సర్వజన’ కష్టాలు’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన వార్తకులు ఆమె స్పందించారు. వార్డుల్లో పనిచేసే ఎంఎన్‌ఓ, ఎఫ్‌ఎన్‌ఓ, జీడీఏలు రోగులను వివిధ పరీక్షలకు తీసుకెళ్లాలని ఆదేశాలు జారీచేశారు. ఆరోగ్యశ్రీ రిజిస్ట్రేషన్‌ కోసం ఆరోగ్యశ్రీ గది వద్దకు రోగులు రాకుండా డేటా ఎంట్రీ ఆపరేటర్లు వార్డుకు వెళ్లి రిజిస్ట్రేషన్‌ చేయాలని సూచించారు.

ఆరోగ్యంపై అవగాహన కల్పించాలి

విజయనగరం అర్బన్‌: విద్యార్థులకు విద్యతో పాటు ఆరోగ్యంపై అవగాహన కల్పించాలని ఉపాధ్యాయులకు డీఈఓ యూ.మాణిక్యంనాయుడు సూచించారు. విజయనగరం కస్పా మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఉన్నత పాఠశాలలో మంగళవారం ‘స్కూల్‌ హెల్త్‌–వెల్‌నెస్‌’ కార్యక్రమంపై ఒక రోజు ఓరియెంటేషన్‌ శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులకు ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేయడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని పేర్కొన్నారు. వైద్యశాఖ జిల్లా సమన్వయకర్త డాక్టర్‌ సుబ్రహ్మణ్యం పాఠశాల విద్యార్థుల్లో సాధారణంగా కనిపించే ఆరోగ్య సమస్యలు, వెల్‌నెస్‌ అంశాలపై అవగాహన కల్పించారు.

మారు‘మోగిన’ జాతర

రాజాం సిటీ: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దేవత, రాజాం–బొబ్బిలి రోడ్డులోని పోలిపల్లిపైడితల్లి మారుజాతర మంగళవారం ఘనంగా నిర్వహించారు. గతనెల 22 నుంచి 24వ తేదీవరకు అమ్మవారి శతవార్షిక జాతర నిర్వహించిన విషయం విదితమే. ఈ నెల 3న నిర్వహించాల్సిన మారుజాతర గ్రహణం కారణంగా వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో అమ్మవారిని దర్శించుకోలేని భక్తులు మంగళవారం దర్శించుకున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటుచేశారు. ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్‌ సమక్షంలో భక్తులకు అన్నసమారాధన జరిపారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త వాకచర్ల దుర్గాప్రసాద్‌, ఈఓ బీవీ మాధవరావు, ఆలయ కమిటీ సభ్యులు సలాది తులసీదాస్‌, వి.లక్ష్మణరావు, ఎ.వెంకటినాయుడు, గంది గోపి, పి.చైతన్య, పి.సురేష్‌కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement