పురాల్లో ప్రత్యేక పాలన | - | Sakshi
Sakshi News home page

పురాల్లో ప్రత్యేక పాలన

Mar 11 2026 9:01 AM | Updated on Mar 11 2026 9:01 AM

బొబ్బిలి: జిల్లాలోని నగర, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ప్రత్యేకాధికారుల పాలనకు తెరలేచింది. నగర పాలక సంస్థలు, పురపాలికలు, నగర పంచాయతీల్లోని పాలక వర్గాల పదవీ కాలం ఈనెల 17తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికలు ఉంటాయని కొందరు, ప్రస్తుతం ప్రజల్లో కూటమి పాలనపై వ్యతిరేకత కారణంగా ప్రత్యేకాధికారుల పాలన ఉంటుందని అధికమంది అభిప్రాయాలు వ్యక్తంచేశారు. చివరకు ప్రత్యేక పాలనకే చంద్రబాబు ప్రభుత్వం మొగ్గుచూపుతూ మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది.

బాధ్యతలు ఇలా...

విజయనగరం కార్పొరేషన్‌కు జిల్లా కలెక్టర్‌ రామసుందర్‌ రెడ్డిని ప్రత్యేకాధికారిగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్‌ కార్యదర్శి ఎస్‌.సురేష్‌కుమార్‌ ఉత్తర్వులలో పేర్కొన్నారు. బొబ్బిలి మున్సిపాలిటీకి అక్కడి ఆర్డీఓ జేవీఎస్‌ఎస్‌ రామమోహనరావును ప్రత్యేకాధికారిగా నియమించారు. అలాగే, నెల్లిమర్ల నగర పంచాయతీకి విజయనగరం ఇన్‌చార్జి ఆర్డీఓ వెంకటేశ్వర రావు(ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ)ను ప్రత్యేకాధికారిగా నియమించారు. రాజాం నగర పంచాయతీలో 11 సంవత్సరాలుగా ప్రత్యేకాధికారి పాలనే కొనసాగుతోంది. ప్రస్తుతం ఎం.సుధారాణి ప్రత్యేకాధికారిగా కొనసాగుతున్నారు.

స్థానిక ఎన్నికలకు వెనుకడుగు?

ఈనెల 17తో పురపాలక, నగరపాలక సంస్థల పాలక వర్గాల పదవీ కాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించాల్సిన ప్రభుత్వం.. ప్రత్యేకాధికారుల పాలనకు మొగ్గుచూపడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గడిచిన సార్వత్రిక ఎన్నికల సమయంలో అలవికాని హామీలిచ్చిన చంద్రబాబు ప్రభుత్వం వాటిని అమలు చేయడంలో విఫలమైంది. డైవర్షన్‌ రాజకీయాలు చేస్తూ ప్రజలను మభ్యపెడుతోంది. దీనిపై ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. ఒక వేళ స్థానిక సంస్థల ఎన్నికలకు వెళితే ఆ వ్యతిరేకత కూటమి కొంప ముంచుతుందనే భయం కూటమి నాయకులను వెంటాడుతోంది. అందుకే ఎన్నికలకు వెళ్లకుండా ప్రత్యేకాధికారులపై పరిపాలన వదిలేయడం మంచిదనే ఆలోచన చంద్రబాబు అండ్‌కో చేసినట్టు రాజకీయవిశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అవిశ్వాసంతో.. విశ్వాసం కోల్పోయి..

అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పాలకవర్గాల్లోని సభ్యులకు పదవులు, ఆర్థిక పరమైన అంశాలను ఎరగా వేసి కూటమి నేతలు తమవైపు తిప్పుకున్నారు. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి కొత్త పాలక వర్గాల్లో తమ వ్యక్తులను నియమించుకున్నారు. ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా అధికారాలను అప్పనంగా లాక్కున్నారు. ఈ దశలో ఎన్నికలకు వెళ్తే గడచిన మున్సిపల్‌, కార్పొరేషన్‌ ఎన్నికల్లో తామువేసిన ఓటుకు విలువలేకుండా అధికార మార్పిడి చేసిన వారిపై ఓటర్లు రిటర్న్‌ గిఫ్ట్‌ ఇస్తారేమోనన్న అనుమానాలు కూడా కూటమి నాయకులను వెంటాడుతుండొచ్చని రాజకీయ వేత్తలు చెబుతున్నారు.

విజయనగరం పట్టణ ప్రత్యేకాధికారిగా కలెక్టర్‌కు బాధ్యతలు

మిగిలిన పట్టణాల్లో జేసీ, ఆర్డీఓలకు

అధికారాలు

ఈనెల 17తో ముగియనున్న పాలక వర్గాల పదవీ కాలం

పురాల్లో ప్రత్యేక పాలనపై ఉత్తర్వులు

విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం

‘స్థానిక’ ఎన్నికల నిర్వహణకు వెనుకంజ

బొబ్బిలి మున్సిపల్‌ కార్యాలయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement