అమ్మో... సర్కిల్‌ సార్‌.. | - | Sakshi
Sakshi News home page

అమ్మో... సర్కిల్‌ సార్‌..

Mar 11 2026 9:01 AM | Updated on Mar 11 2026 9:01 AM

సాక్షి ప్రతినిధి,విజయనగరం:

మయ్యా వన్‌ నాట్‌ టూ... ఊళ్లో ఏం జరుగుతోంది? దర్పంగా అడిగారు సర్కిల్‌ పెద్దసార్‌... ఏం లేదుసార్‌... ఏముంటాయి.. పక్క ఊళ్లో పండగ...మర్నాడు ఈ ఊళ్లో జాతర.. ఆ డ్యూటీలు ఉన్నాయి సార్‌... వినయంతో చెప్పాడు కానిస్టేబుల్‌. ఏంటయ్యా ఊరి జనాలు పండగ చేసుకుంటే మనం ఎండలో చెమటలు కక్కుకుంటూ డ్యూటీలు చేయాలా?.. వాళ్ల బళ్లకు మనం కాపలా కాయాలా? వాళ్ల పిల్లలు తప్పిపోతే మనం వెతికి తెచ్చి ఇవ్వాలా? ముసలి ముతక జనాలను రోడ్లు దాటించాలా? ఇలా చేస్తే పేపర్లో మనపేర్లు ? ఫొటోలు వస్తాయా? ఈ పేర్లు.. ఫొటోలు ఎవరిక్కావాలయ్యా... మనకు పండగ లేదా? ఉండాలి.. మనం కూడా పండగ చేద్దాం... పోలీసుల పండగ అంటే ఎలా ఉంటుందో జనానికి.. వ్యాపారులకు చూపిద్దాం పదా అంటూ లాఠీ పట్టుకుని జీపెక్కారు. రాజాం టౌన్‌ సర్కిల్‌లో తన దందా మార్క్‌ చూపించి తోటి సిబ్బందినే ఆశ్చర్యపరిచారు.

జనానికి జాతర.. ఆయనకు పండగ..

రాజాంతో పాటు చుట్టుపక్కల జాతరయ్యిందంటే చాలు రాజాం పట్టణ సర్కిల్‌ బాస్‌కు పెద్ద పండగేనట. ఇక్కడ బాగా ఆరితేరి ఉండడంతో పాటు అందరితో పరిచయాలు బాగా కలిసివస్తున్నాయి. గ్రామా దేవత పండగల్లో గుండాట, అట్టాటలు, బెల్ట్‌ షాపులకు అనఽఽధికార అనుమతులు ఇస్తూ ఒక్కో వ్యాపారానికి ఒక్కోరేటు వసూళ్లు చేస్తున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అలా కుదరని చోట పెద్ద వ్యాపారులను స్పాన్సర్ల రూపంలో పిండేస్తున్నారు. అడిగేవారు, ప్రశ్నించే వారు లేకపోవడంతో ‘అశోక’వనంలో ప్రజల శోకాలు ఎవరికి వినిపించడం లేదు. భక్షక భటుడి అక్రమార్జనకు అడ్డూలేకుండా పోతోంది.

అట్టాటకు అడ్డగోలు అనుమతులు..

అంతకాపల్లిలో ఏటా జరిగే మజ్జిగౌరమ్మ జాతర పోలీసులకు నిజమైన పండగ తెచ్చింది. పండగన్నాక జూదం లేకుంటే ఎలా.. జూదం పెట్టుకోండి.. మాకు ఓ లక్ష ఇచ్చుకోండి అంటూ పోలీస్‌ బాస్‌ ఆఫర్‌ ఇవ్వడంతో ఒక్క రాత్రికే లక్షల జూదం నడిచినట్టు సమాచారం. జూదం జరిగిన తీరును వీడియోల రూపంలో కొందరు నిక్షిప్తం చేసి.. ఇదంతా ఖాకీబాస్‌ అనుమతితోనే జరిగిందంటూ చూపిస్తుండడం గమనార్హం.

రాజాం పట్టణంలో ఎటువంటి వివాదాలు వచ్చినా పోలీస్‌ స్టేషన్‌ అంటేనే ప్రజలు భయపడుతున్నారు. ఆ మధ్య మల్లికార్జున కాలనీలో ఓ వ్యక్తి ఇంటి జాగాను మరో వ్యక్తి ఆక్రమించి నిర్మాణాలు చేస్తే దీన్ని అడ్డుకోవాల్సిన పోలీస్‌ బాస్‌ వన్‌ సైడ్‌ వ్యవహారం నిర్వహించారు. దీనిపై బాధితుడు డీఎస్పీ కార్యాలయాన్ని ఆశ్రయించగా, కొద్ది రోజులు నిర్మాణాలు ఆపి, ఇరు వర్గాల వద్ద ఆధారాలు పరిశీలించాలని ఆదేశాలిచ్చారు. దీనిపై మండిపడుతూ సదరు బాధితుడికి సర్కిల్‌ అధికారి ఏకంగా హెచ్చరికలు జారీచేశారు. రౌడీ షీటర్‌ ఓపెన్‌ చేస్తానంటూ బెదిరించడంతో బాధితుడు భయపడుతున్నాడు. ఏదైనా వివాదంలో ఫిర్యాదు చేసేందుకు వచ్చిన బాధితులతో పాటు రెండో వర్గాన్ని కూడా పిలిచి, ఎవరు ఎక్కువ ఇస్తే వారికే సపోర్ట్‌ చేస్తున్నారన్న ఆరోపణలు ఇక్కడ బోలెడు. ఎవరైనా మొండికేస్తే పోలీస్‌ స్టేషన్‌లో పేరుబడిన కొంతమంది పాత నేరస్తులతో భయపెట్టించడం సంబంధిత అధికారికి వెన్నతో పెట్టిన విద్యగా మారిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

స్పాన్సర్ల పేరిట భారీగా దండకం

పెద్ద వ్యాపారులే టార్గెట్‌

రాజాం టౌన్‌ సర్కిల్‌ పేరు చెబితే హడల్‌

అంతకాపల్లిలో అట్టాట, రూ.లక్షల్లో జూదం

పోలిపల్లి పైడితల్లి జాతరలో డ్రోన్‌, సీసీ కెమెరాల పేరిట భారీగా వసూళ్లు

రాజాం చుట్టుపక్కల జాతర అయిందంటే పండగే

జూదం చట్టవిరుద్ధం... అరికడతాం

రాజాం పట్టణ పోలీసు అధికారిపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి ఆధారాలు ఉంటేమాకు ఇవ్వండి... కచ్చితంగా దర్యాప్తు చేస్తాం. జాతరల్లో అట్టాటలు, గుండాట వంటి జూదాలు నిషిద్ధం. ఇలాంటివి ఎవరు చేసినా శిక్షార్హులు. అలాంటి ఆటలు ఆడినా...వాటిని ప్రోత్సహించినా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.

– రాఘవులు, డీఎస్పీ,

చీపురుపల్లి సబ్‌ డివిజన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement