రామతీర్థసాగర్‌పై నిర్లక్ష్యం
● ఏడాదిన్నరగా ముందుకు సాగని పనులు
● ప్రాజెక్టు పూర్తయితే 24,710 ఎకరాలకు సాగునీరు
● విజయనగరం పట్టణానికి తాగునీరు
● కూటమిసర్కారు తీరుతో ఆందోళనలో రైతులు
పూసపాటిరేగ: కూటమి సర్కారు అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర సమయం పూర్తవుతున్నా ఒక్క పైసా కూడా విదల్చకపోవడంతో రామతీర్థసాగర్ రిజర్వాయర్ పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నాయి. రిజర్వాయర్ ట్యాంకులో అడవిని తలపించినట్లు తుప్పలు పెరిగాయి. రిజర్వాయర్ నిర్మాణం పూర్తయితే పూసపాటిరేగ, భోగాపురం, డెంకాడ, నెల్లిమర్ల మండలాల్లోని 24,710 ఎకరాలకు సాగునీరు, విజయనగరం పట్టణానికి తాగునీరు అందుతుంది. గుర్ల మండలం కోటగండ్రేడు వద్ద చంపావతినదిలో బ్యారేజీ నిర్మించి కాలువ ద్వారా రోజుకు 1200 క్యూసెక్కుల నీరు మళ్లించి 2.728 టీఎంసీల నీరు రిజర్వాయర్‌లో నిల్వ ఉండే విధంగా డిజైన్ చేశారు. రిజర్వాయర్ కుడి, ఎడమ కాలువలు 25.22 కిలోమీటర్లు కాగా, సుమారు 12 కిలో మీటర్ల మేర పనులు మాత్రమే ఇప్పటికి పూర్తయ్యాయి. మిగిలిన 13.22 కిలో మీటర్ల పనులు జరగాల్సి ఉంది. రిజర్వాయర్ డెడ్ స్టోరేజీ 0.48 టీఎంసీల నీటితో విజయనగరం పట్టణానికి తాగునీరు అందించడానికి ప్రణాళిక సిద్ధమైంది. అయితే కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తరువాత 18 నెలల కాలంగా రిజర్వాయర్ పనులు ముందుకు సాగలేదు. 2006లో రామతీర్థసాగర్ రిజర్వాయర్‌ను రూ.220 కోట్ల ఖర్చు అంచనా వ్యయంతో పనులు ప్రారంభించారు. దఫదఫాలు అంచనా వ్యయం పెంచిన ప్రభుత్వాలు 2025 ఫిబ్రవరి నాటికి రూ.808 కోట్లు అంచనా వ్యయంగా ఖరారు చేసింది. ప్రాజెక్టు నిర్వాసిత గ్రామాలకు సుమారు రూ.100 కోట్ల వరకు అవసరం అవుతుందని అధికారులు అంచనా వేశారు. రామతీర్ధసాగర్ ప్రాజెక్టు ద్వారా భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి అవసరమైన నీటితో పాటు జిల్లాలో నూతనంగా నిర్మాణం అవుతున్న పరిశ్రమలకు కావాల్సిన నీరు ప్రాజెక్టు ద్వారానే అందించడానికి సన్నాహాలు చేశారు. ప్రాజెక్టు ప్రారంభమై 19 సంవత్సరాలు అవుతున్నా నేటికీ పనులు పూర్తికాని పరిస్థితి. ఇప్పటివరకు సుమారు 55 శాతం వరకు పనులు మాత్రమే జరిగినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. 2026 నాటికి పనులు పూర్తి చేయడానికి ఒప్పందం జరిగినప్పటికీ పనుల్లో మాత్రం కదలిక లేదు. నెల్లిమర్ల నియోజకవర్గం ప్రజలు సాగునీరు, విజయనగరం పట్టణ ప్రజలు తాగునీటి కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు రామతీర్థసాగర్ రిజర్వాయర్ పనులు సకాలంలో పూర్తిచేసి రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు.
పనులు సకాలంలో పూర్తి చేయాలి
రామతీర్థసాగర్ రిజర్వాయర్ పనులు సకాలంలో పూర్తి చేయాలి. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలోనే 55 శాతం పనులు పూర్తి అయ్యాయి. నేటి పరిస్థితి చూస్తే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా పనులు నిలిచిపోయాయి. నియోజకవర్గంలో ప్రజలకు సాగునీరు అందేవిధంగా చర్యలు తీసుకోవాలి.
తాళ్లపూడి అప్పలనాయుడు, రైతు, పూసపాటిరేగ
ఆర్‌ఆర్ ప్యాకేజీ మంజూరు చేయాలి
కోరాడపేట, ఏటీ అగ్రహారం గ్రామాలకు ఆర్‌ఆర్ ప్యాకేజీ మంజూరు చేయాలి. ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభించి సుమారు 19 సంవత్సరాలు అవుతున్నా పనులు పూర్తి కాలేదు. సకాలంలో పునరావాసం కల్పించాలి. నిర్వాసితుల కాలనీలకు నిధులు మంజూరు చేసి గృహాలు తక్షణమే నిర్మాణం జరిగే విధంగా చూడాలి.
కె.కృష్ణ, కోరాడపేట నిర్వాసితుడు
రామతీర్థసాగర్‌పై నిర్లక్ష్యం


