పంచాయతీ స్థలం ఆక్రమణ
● ఇంటి నిర్మాణానికి టీడీపీ నాయకుల యత్నం
● అడ్డుకున్న గ్రామస్తులు, మహిళలు
బొబ్బిలిరూరల్: మండలంలోని పారాది గ్రామంలో పంచాయతీ స్థలాన్ని ఆక్రమించి ఇంటినిర్మాణానికి పూనుకున్న టీడీపీ నాయకుల ఆగడాలను స్థానికులు అడ్డుకున్నారు. గ్రామంలో మెయిన్ రోడ్డును ఆనుకుని ఉన్న సుమరు 150 గజాల స్థలంపై టీడీపీ నాయకుల కన్నుపడింది. కొత్తగా ప్రభుత్వం ఇంటినిర్మాణాలకు రుణసహాయం చేస్తామని ప్రకటించడంతో ఇంటి నిర్మాణానికి అనుమతి తెస్తానని గ్రామ పంచాయతీకి చెందిన కాలువ, రోడ్డును ఆక్రమించుకుని ఇంటి నిర్మాణం చేపట్టవచ్చని గ్రామ టీడీపీ నాయకుడి సూచనతో శనివారం రాత్రి జేసీబీతో అక్కడి మట్టిని తొలగించేందుకు ఆక్రమణ దారు ప్రయత్నించాడు. దీంతో గ్రామస్తులు, మహిళలు తిరగబడ్డారు. గ్రామంలో ఉన్న ప్రధాన మురుగునీరు పోయే కాలువను, రోడ్డును ఆక్రమించి చేపడుతున్న నిర్మాణాన్ని అడ్డుకున్నారు. ఈ ఆక్రమణపై పంచాయతీ సెక్రటరీ ఇప్పటికే నోటీసులిచ్చినా తోసిరాజని నిర్మాణానికి ప్రయత్నించడంపై పంచాయతీ శాఖ డీఈఈ వెంకటప్పారావుకు విషయాన్ని చేరవేశారు. జేఈతో సమగ్ర దర్యాప్తుకు డీఈఈ ఆదేశించగా ఇంతలోనే నిర్మాణానికి యత్నించడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో మురుగునీరు పారే కాలువ, వేగావతికి వెళ్లే రహదారి పూర్తిగా మూసుకుపోతుందని వెంటనే చర్యలు చేపట్టాలని ఇటీవల గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో కలెక్టర్ నిర్వహిస్తున్న పీజీఆర్‌ఎస్‌లో సైతం ఫిర్యాదు చేసినా ఆక్రమణను అధికారులు అడ్డుకోకపోవడం, అధికార పార్టీ నాయకుల అండదండలతో ఇంటి నిర్మాణానికి పూనుకుం టుండంతో గ్రామస్తులంతా మూకుమ్మడిగా అక్కడి పనులను అడ్డుకున్నారు. పంచాయతీ అధికారులనుంచి స్పందన రాకపోవడంతో స్థానిక పోలీస్‌స్టేషన్‌లో శనివారం ఫిర్యాదు చేశారు. ఆక్రమణ దారు అధికార పార్టీకి చెందిన వాడు కావడంతో దౌర్జన్యంగా జేసీబీతో పనులు చేపడుతున్నాడని, పంచాయతీ అధికారులు ఇచ్చిన నోటీసులను సైతం పట్టించుకోకుండా ఇంటినిర్మాణానికి పూనుకుంటున్నట్లు, అడ్డగించిన వారిపై దౌర్జన్యం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పంచాయతీ తీర్మానాలు, అనుమతులు లేకుండా చేస్తున్న నిర్మాణానికి అధికార తెలుగుదేశం పార్టీ నాయకుడి అండదండలున్నాయని ఈ దురాక్రమణను అడ్డుకోవాలని కోరారు. దీంతో ప్రస్తుతం నిర్మాణం ఆగిపోయినా మళ్లీ చేపడితే తీసుకోవాల్సిన చర్యలపై ఇరు వర్గాలను పిలిచి చర్చిస్తామని పోలీసులు తెలిపారు.


