స్కూటీని ఢీకొట్టిన భారీ లారీ
● సంఘటన స్థలంలో వ్యక్తి మృతి
● కొన ఊపిరితో మృతుడి సోదరుడు
● తీవ్రంగా గాయపడిన మృతుడి ఇద్దరు పిల్లలు
కొత్తవలస: అరుకు–విశాఖపట్నం జాతీయ రహదారిలో కొత్తవలస అగ్నిమాపక కేంద్రం సమీపంలో ఆదివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి బంధువులు, సీఐ సీహెచ్.షణ్ముఖరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. వేపాడ మండలం కుమ్మపల్లి గ్రామానికి చెందిన గొల్ల శంకరరావు(52)తన సోదరుడు దారప్పకు చెందిన స్కూటీపై తన ఇద్దరు పిల్లలైన భవానీశంకర్ (6),హరినాథ్(4)లను విశాఖపట్నంలోని ఆర్‌కేబీచ్‌ను చూపిద్దామని బయల్దేరారు. కొత్తవలస అగ్నిమాపక కేంద్రం సమీపంలోకి వచ్చే సరికి వెనుక నుంచి అతివేగంగా వచ్చిన భారీ లారీ స్కూటీని పక్కనుంచి బలంగా ఢీకొట్టింది.దీంతో స్కూటీ వెనక కూర్ఛున్న శంకరరావు(52)తలపై నుంచి లారీ చక్రాలు వెళ్లడంతో అక్కడిక్కడే మృతిచెందాడు. స్కూటీపై కూర్ఛున్న ఇద్దరు పిల్లలు తుళ్లిపడి రోడ్డుపై పడ్డారు. స్కూటీని డ్రైవ్ చేస్తున్న దారప్ప తల రోడ్డుకు బలంగా కొట్టుకోవడంతో తల భాగంలో బలమైన గాయాలై ముక్కు, చెవుల నుంచి అధిక రక్తస్రావం జరిగింది. స్థానికులు,108 వాహనానికి సమాచారం అందించిన ఎంతకీ రాకపోవడంతో రోడ్డు సేఫ్టీ వాహనం పోలీస్ సిబ్బంది అప్రమత్తమై క్షతగాత్రులను రోడ్డు సేప్టీ వాహననం వెనుక ట్రక్కులో వేసుకుని స్థానిక పీహెచ్‌సీకి తరలించారు. అక్కడి వైద్య సిబ్బంది ప్రథమ చికిత్స నిర్వహించి దారప్ప పరిస్థితి విషమంగా ఉండడంతో విశాఖపట్నం కేజీహెచ్‌కి తరలించారు. కాగా చిన్నారులు భవానిశంకర్, హరినాథ్‌లకు తీవ్రగాయాలు కావడంతో స్థానిక పీహెచ్‌సీలోనే చికిత్స అందిస్తున్నారు. కాగా మృతుడి మరో సోదరుడు ఈశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు శవ పంచనామా నిర్వహించి మృతదేహాన్ని ఎస్.కోట సీహెచ్‌సీకి తరలించారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ షణ్ముఖరావు తెలిపారు.
స్కూటీని ఢీకొట్టిన భారీ లారీ


