రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు జిల్లా జట్ల ఎంపిక
విజయనగరం: రాష్ట్రస్థాయిలో జరగనున్న జూనియర్స్ బాల, బాలికలు, సీనియర్స్ సీ్త్ర, పురుషుల ఖోఖో పోటీల్లో పాల్గొనబోయే జిల్లా జట్ల ఎంపికలు ఆదివారం పూర్తయ్యాయి. జిల్లా ఖోఖో అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరంలోని కార్పొరేషన్ కస్పా ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఎంపికలకు జిల్లా నలుమూలల నుంచి 170 మంది క్రీడాకారులు హాజరయ్యారు. హాజరైన క్రీడాకారులకు జూనియర్స్, సీనియర్స్ విబాగాల్లో ఎంపిక పోటీలు నిర్వహించగా ఆద్యంతం ఉత్కంఠభరితంగా పోటీలు సాగాయి. ఎంపికల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 30 మంది క్రీడాకారులను జూనియర్స్ విభాగంలో ఎంపిక చేయగా.. సీనియర్స్ విభాగంలో మరో 30 మంది అర్హత సాధించారు. జూనియర్స్ విభాగంలో ఎంపికై న బాల, బాలికల క్రీడాకారులు ఈనెల 19,20,21 తేదీల్లో ప్రకాశం జిల్లా పంగులూరులో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా నుంచి పాల్గొననున్నారు. అదేవిధంగా సీనియర్స్ విభాగంలో అర్హత సాధించిన క్రీడాకారులు ఈనెల 24,26 తేదీల్లో గుడివాడలో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీలకు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించనున్నారు. ఎంపిక పోటీలను జిల్లా ఖోఖో అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు వీవీ రమణమూర్తి, అధ్యక్షుడు ఏఎంఎన్ కమలనాభరావు, ప్రధాన కార్యదర్శి కె.గోపాల్, కోశాధికారి ప్రసాద్, ఆర్గనైజింగ్ కార్యదర్శి మల్లి కార్జునారావు, ఎస్‌జీఎఫ్ కార్యదర్శి ఎస్.విజయలక్ష్మి, పీడీ వరలక్ష్మి, రామకృష్ణ, రాంబాబు, హరీష్, సత్యనారాయణ, శ్రీను తదితరులు పర్యవేక్షించారు.


