త్రుటిలో తప్పిన పెనుప్రమాదం
● మద్యం మత్తులో టిప్పర్‌ను ఢీకొన్న ద్విచక్ర వాహదారు
భోగాపురం: మద్యం మత్తులో ఓ యువకుడు ద్విచక్ర వాహనానంపై వస్తూ ఎదురుగా వస్తున్న టిప్పర్‌ను ఢీకొట్టాడు. అయితే ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనదారు స్వల్ప గాయాలతో బయట పడగా పెనుప్రమాదం తప్పడంతో ముంజేరు గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. భోగాపురం మండలంలోని ముంజేరు గ్రామంలో ఆర్‌అండ్‌బీ రహదారిపై ఆదివారం జరిగిన సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. జిల్లాలోని దేవరాపల్లి గ్రామానికి చెందిన యువకుడు గండ్రేటి పాలవెల్లి రెడ్డికంచేరు సమీపంలో నిర్మాణంలో ఉన్న విమానాశ్రయంలో జేసీబీ ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఆదివారం సెలవు కావడంతో పూటుగా మద్యం తాగి బైక్‌పై భోగాపురం బయలు దేరాడు. భోగాపురం నుంచి ముక్కాం వైపు వస్తున్న టిప్పర్ ముంజేరు వద్దకు చేరుకునేసరికి మద్యం మత్తులో ఉండి ఎదురుగా బైక్‌పై వస్తున్న వాహదారును గమనించిన టిప్పర్ డ్రైవర్ రోడ్డుపై ఆపివేశాడు. అయినప్పటికీ మద్యం మత్తులో ఉన్న ద్విచక్ర వాహనదారు ఆగి ఉన్న టిప్పర్‌ను ఢీకొట్టి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. అక్కడే ఉన్న గ్రామస్తులు స్వల్ప గాయాలపాలైన పాలవెల్లిని లేపి సపర్యలు చేసి, టిప్పర్‌కు అడ్డంగా ఉన్న ద్విచక్ర వాహనాన్ని పక్కకు తీసి ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చేశారు.


