ప్రజా వ్యతిరేక నిర్ణయంపై పోరాటం
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ దుర్మార్గం
నేడు జిల్లా కేంద్రంలో కోటి సంతకాల ప్రతులతో ప్రజా అవగాహన ర్యాలీ
పాల్గొననున్న శాసనమండలి విపక్ష నేత బొత్స, నియోజకవర్గ సమన్వయకర్తలు
స్థల పరిశీలన చేసిన జెడ్పీ చైర్మన్,
మాజీ డిప్యూటీ స్పీకర్‌లు
విజయనగరం:
ప్రభుత్వం అవలంభిస్తోన్న ప్రజా వ్యతిరేక విధానాల్లో కీలకమైన మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బాధ్యత గల ప్రతిపక్షంగా వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఈ నెల 15న సోమవారం విజయనగరం జిల్లా కేంద్రంలో తలపెట్టిన ప్రజా చైతన్య ర్యాలీలో విద్యార్థులు, ఉద్యోగులు, మేధావులతో పాటు అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని జిల్లా పరిషత్ చైర్మన్, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు, ఏపీ శాసనసభా మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి పిలుపునిచ్చారు. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల 15న మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిర్వహించతలపెట్టిన ర్యాలీకి సంబంధించిన ఏర్పాట్లును ఆదివారం వారు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎంఆర్ జంక్షన్ వద్ద గల దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం జిల్లా వ్యాప్తంగా 7 నియోజకవర్గాల నుంచి సేకరించిన సంతకాల ప్రతులతో ప్రజా చైతన్య ర్యాలీ నిర్వహించటం ద్వారా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించనున్నట్టు తెలిపారు. ఇప్పటికే విజయనగరం జిల్లా పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విద్యార్థులు, మేధావులు, వ్యాపారులు అన్ని వర్గాల ప్రజల స్వచ్ఛంద మద్దతుతో సేకరించిన సుమారు 4 లక్షల సంతకాల ప్రతులను వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో భద్రపరచటం జరిగిందన్నారు. సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగస్వాములైన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. బాధ్యత గల ప్రతిపక్షంగా ప్రభుత్వ తీసుకున్న నిర్ణయాన్ని పునరాలోచించేలా చేపట్టిన కార్యక్రమం విజయవంతమైందన్నారు. సోమవారం నిర్వహించే ర్యాలీలో శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణతో పాటు జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, ప్రజాప్రతినిధులు, అన్ని రాజకీయ పక్షాలు, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఐదు కోట్ల మంది ప్రజలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నా పట్టించుకోకపోవటం దారుణమన్నారు. ప్రజా మద్దతుతో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. ఇలా సేకరించిన సంతకాలను మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో ఈ నెల 18న రాష్ట్ర గవర్నరుకు అందజేయటం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు వర్రి నర్సింహమూర్తి, సంగంరెడ్డి బంగారునాయుడు, కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ శెట్టివీరవెంకట రాజేష్, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు పీరుబండి జైహింద్‌కుమార్, విజయనగరం నగర పార్టీ అధ్యక్షుడు ఆశపు వేణు, నగర ప్రధాన కార్యదర్శి బోడసింగి ఈశ్వరరావు, కార్పొరేటర్‌లు బండారు ఆనంద్, బోనెల ధనలక్ష్మి, పట్నాన పైడిరాజు, పార్టీ నాయకులు పిన్నింటి సూర్యనారాయణ, భోగాపురపు రవిచంద్ర, కాళ్ల సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.


