బంగారం కోసం వృద్ధురాలి హత్య
● ఆర్‌అండ్‌ఆర్ కాలనీ ముడసర్లపేటలో దారుణం
భోగాపురం: రెండు తులాల బంగారం కోసం వృద్ధురాలిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసిన సంఘటన శనివారం ఉదయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలు.. మండలంలోని ఆర్‌అండ్‌ఆర్ కాలనీ ముడసర్లపేట గ్రామానికి చెందిన ముడసర్ల అప్పయ్యమ్మ (70) ఇంట్లో నిద్రిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి ఆమెను హత్య చేసి ముక్కు, చెవి, మెడలో ఉన్న సుమారు రెండు తులాల బంగారు నగలను అపహరించుకుని మృతదేహాన్ని సమీపంలో ఉన్న వాటర్ ట్యాంకు వద్ద వదిలేసి పారిపోయారు. దీంతో ఒక్కసారిగా గ్రామంలోని ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఈమెకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమారుడు జీవనోపాధి కోసం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం వెళ్లాడు. చిన్న కుమారుడు భవానీ మాల వేసుకుని కుటుంబంతో కలిసి కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు విజయవాడ కొండకు వెళ్లాడు. దీంతో ఇంట్లో ఎవరు లేకపోవడంతో దుండగులు ఇంట్లోకి చొరబడి అప్పయ్యమ్మను దారుణంగా హత్య చేసి ముక్కు, చెవి, మెడలో ఉన్న బంగారాన్ని అపహరించుకుని పారిపోయారు. స్థానికులు ఉదయం వాటర్‌ట్యాంకు దగ్గర విగతజీవిగా పడి ఉన్న అప్పయ్యమ్మ మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న డీఎస్పీ ఆర్.గోవిందరావు, సీఐ దుర్గాప్రసాద్, ఎస్సై పాపారావులు విశాఖపట్నం రీజినల్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ నిపుణులతో కలిసి సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టి వివరాలు సేకరించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని సుందరపేట సీహెచ్‌సీకి తరలించారు. మృతురాలి పెద్ద కోడలు ముడసర్ల లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, త్వరలోనే హత్య చేసిన దుండగులను గుర్తించి అరెస్టు చేస్తామని డీఎస్పీ తెలిపారు.


