చెరకు రైతుకు ఊరట
రేగిడి: విజయనగరం జిల్లాలోనే కాకుండా పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, అనకాపల్లి జిల్లాల్లో చెరకు సాగుచేస్తున్న రైతులకు ఈ ఏడాది ఎట్టకేలకు ఊరట లభించింది. ప్రభుత్వ అలసత్వం కారణంగా చెరకు రైతులు ఇప్పటికే సాగు తగ్గించేశారు. కాస్తో కూస్తో సాగుచేస్తున్న రైతులను ఆదుకునే పరిస్థితిలో కూటమిప్రభుత్వం లేదు. గతేడాది వరకూ మూడు జిల్లాల చెరకు రైతులకు ఆసరాగా మిగిలిన రేగిడి మండలంలోని సంకలి వద్ద గల ఈఐడీ ప్యారీ చక్కెర కర్మాగారం ఈ ఏడాది విశాఖపట్నం జిల్లాలోని కొన్ని ప్రాంతాల నుంచి చెరకును సేకరిస్తోంది. గతంలో రాయితీపై విత్తనాలు, ఎరువులు అందించే ఈ ఫ్యాక్టరీ ఈ ఏడాది ఎటువంటి రాయితీలు ఇవ్వలేదు. మరో వైపు ప్రతి ఏటా దసరాకు చెరకు క్రషింగ్ ప్రారంభించే ఫ్యాక్టరీ ఈ ఏడాది ఆలస్యంగా క్రషింగ్ ప్రారంభించింది.
తగ్గిన క్రషింగ్ లక్ష్యం
గతేడాది కంటే ఈ ఏడాది క్రషింగ్ లక్ష్యాన్ని ఈఐడీ కర్మాగారం తగ్గించింది. గతేడాది 3.50 లక్షల మెట్రిక్ టన్నుల క్రషింగ్ లక్ష్యం కాగా, ఈ ఏడాది 2.64 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే క్రషింగ్ లక్ష్యంగా చేసుకుంది. విజయనగరం, శ్రీకాకుళం పార్వతీపురం మన్యం జిల్లాలతో పాటు అనకాపల్లి జిల్లా చోడవరం ప్రాంతంలోని చెరకు క్రషింగ్‌కు అనుమతిలిచ్చింది. ఈ ఏడాది ఈ నాలుగు ప్రాంతాల్లో కేవలం 9300 ఎకరాల్లో మాత్రమే చెరకు క్రషింగ్‌కు రిజిస్ట్రేషన్ నమోదైంది. ఈ మేరకు మాత్రమే సాగును అధికారులు చూపిస్తున్నారు. గతంలో ఒక్క విజయనగరం జిల్లాలోనే ఇంతటి సాగు ఉండేది. ఈ ఏడాది సాగు తగ్గడం, క్రషింగ్ లక్ష్యం తగ్గడం చూస్తుంటే భవిష్యత్తులో ఈఐడీ ప్యారీ నడపడం కష్టంగా కనిపిస్తోంది. గతేడాది రూ.3,150 ఉన్న టన్ను చెరకు మద్దతు ధర ఈ ఏడాది రూ.3360గా చెరకు మద్దతు ధర ప్రకటించారు. పెట్టుబడులు పోను రైతుకు ఎకరా సాగులో కనిపించే ఆదాయం చాలా తక్కువగా ఉండడంతో రైతులు ఈ మద్దతు ధరపై పెదవి విరుస్తున్నారు. బొబ్బిలి జోన్‌లో 75 వేల టన్నుల చెరకును, భీమసింగి ప్రాంతంలో 6వేల టన్నుల చెరకును, చోడవరంలో 20 వేల టన్నుల చెరకును క్రషింగ్‌కు తీసుకోగా, మిగిలిన చెరకును విజయనగరం జిల్లా నుంచి తీసుకుంటున్నట్లు ఫ్యాక్టరీ యాజమాన్యం ప్రకటించింది.
ప్రతికూల వాతావరణం
గతేడాది కంటే ఈ ఏడాది చెరకు పంట దిగుబడి తగ్గింది. ప్రతికూల వాతావరణం కారణంగా పంటకునష్టం సంభవించినట్లు రైతులు వాపోతున్నారు. గతేడాది ఎకరా సాగులో 30 టన్నుల చెరకు దిగుబడి వస్తే ఈ ఏడాది సగటున 25 టన్నుల చెరకు ఒక ఎకరాపొలంలో దిగుబడి వస్తున్నట్లు వెల్లడించారు. ఎకరా సాగుకు రూ.35 వేలు పెట్టుబడి అవుతుండగా, ఈ ఏడాది రూ.40 వేల వరకూ పెట్టుబడులు పెరిగాయని ఆందోళన చెందుతున్నారు. తుఫాన్ వర్షాల నేపథ్యంలో దిగుబడి తగ్గిందని పేర్కొంటున్నారు. సకాలంలో ఎరువులు అందకపోవడం మరో సమస్యగా రైతులు చెబుతున్నారు.
ఎట్టకేలకు క్రషింగ్ ప్రారంభం
సంకిలి ఈఐడీ ప్యారీ కర్మాగారంలో
నెలరోజులు ఆలస్యంగా క్రషింగ్
చెరకు టన్ను ధర రూ.3,360
2.64 లక్షల మెట్రిక్ టన్నుల క్రషింగ్ లక్ష్యం
గ్రామాల్లో వడివడిగా చెరకు కటింగ్ పనులు
ఏప్రిల్ వరకు క్రషింగ్
ఈఐడీ ప్యారీస్ ఫ్యాక్టరీ వద్ద చెరకు క్రషింగ్ ప్రారంభించాం. తొలుత మా ఫ్యాక్టరీ సమీపంలోని రైతులకు కటింగ్ ఆర్డర్లు ఇస్తున్నాం. మాకు విల్లింగ్ ఇవ్వడంతో పాటు చెరకును యాజమాన్య పద్ధతుల్లో సాగుచేసి దిగుబడి సాధిస్తున్న ఇతర ప్రాంతాల రైతులను కూడా గుర్తించాం. ఈ ఏడాది క్రషింగ్ లక్ష్యం మేరకు మార్చి, ఏప్రిల్ నెలవరకూ గానుగ కొనసాగించే ఆలోచనలో ఉన్నాం.
బి. వెంకటసూర్యనారాయణ,జనరల్ మేనేజర్, ఈఐడీ ప్యారీ చక్కెర కర్మాగారం,
సంకిలి, విజయనగరం జిల్లా
చెరకు రైతుకు ఊరట


