పేదోడి పళ్లెంలో ప్రోటీన్ మాయం
పిండి ఇచ్చి.. పప్పు ఎగ్గొడతారా?
జనవరి నుంచి కిలో గోధుమపిండిని రూ.16కే ఇస్తామని, ప్యాకెట్ల రూపంలో సరఫరా చేస్తామని అధికారులు చెబుతున్నారు. విజయనగరం జిల్లాకు 580.15 టన్నులు, మన్యం జిల్లాకు 280.93 టన్నుల పిండి అవసరమని లెక్కలు వేశారు. అయితే, గోధుమపిండితో సరిపెట్టి, అత్యంత ఖరీదైన కందిపప్పును మాత్రం ఎగ్గొట్టే ప్లానన్‌లో ప్రభుత్వం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పాత బకాయిలు, పాత సరుకులు సక్రమంగా ఇవ్వకుండా కొత్తవాటితో మసిపూసి మారేడుకాయ చేయడం తగదని ప్రజలు వాపోతున్నారు. కందిపప్పు పునరుద్ధరణపై స్పష్టమైన ప్రకటన చేయకపోతే ఈ కొత్త సరుకులు ఏ మూలకు? అని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు.
పార్వతీపురం రూరల్: సూపర్ సిక్స్ హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం పేదవాడికి కనీస అవసరమైన ‘కందిపప్పు’ను అందించడంలో చేతులెత్తేసింది. ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేస్తామంటూ గొప్పలు చెబుతున్న సర్కారు..ఆచరణలో మాత్రం పేదోడి కడుపు కొడుతోంది. గత ఏడాది కాలంగా రేషన్ డిపోల్లో కందిపప్పు జాడ లేదు. ఇప్పుడు కొత్తగా జనవరి నుంచి గోధుమపిండి, రాగులు ఇస్తామంటూ ప్రభుత్వం చేస్తున్న ప్రచారం..‘చేతితో ఇచ్చి చేటతో లాక్కున్నట్లు’ ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కందిపప్పు కరువై..ముద్ద దిగేదెలా?
పేదలకు చౌకగా నిత్యావసరాలు అందించాల్సిన బాధ్యతను చంద్రబాబు ప్రభుత్వం గాలికి వదిలేసింది. బహిరంగ మార్కెట్‌లో కందిపప్పు ధరలు మండుతుంటే, రేషన్ ద్వారా అందించాల్సిన పప్పును ఏడాదిగా నిలిపివేయడం చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం. పప్పు అన్నానికి కరువైన సామాన్యుడు..బయట మార్కెట్‌లో రూ.160కి పైగా పెట్టి కొనలేక నానా అవస్థలు పడుతున్నాడు. ఇన్నాళ్లూ మౌనంగా ఉన్న ప్రభుత్వం..ఇప్పుడు పప్పు గురించి మాట్లాడకుండా గోధుమపిండి, రాగులంటూ కొత్త పల్లవి అందుకోవడం ‘కంటితుడుపు చర్య’గానే కనిపిస్తోంది.
ఇచ్చే బియ్యానికి ఎసరు
ప్రభుత్వం కొత్తగా రాగులు ఇస్తున్నామంటూ గొప్పగా చెబుతున్నా..దాని వెనుక ఉన్న మెలిక చూసి లబ్ధిదారులు ముక్కున వేలేసుకుంటున్నారు. రాగులను అదనంగా ఇవ్వడం లేదు. ప్రస్తుతం ఇస్తున్న బియ్యం కోటాలో కోత విధించి మరీ ఇస్తున్నారు. ఉదాహరణకు 20 కిలోల బియ్యం తీసుకునే కుటుంబానికి..ఇకపై 17 కిలోల బియ్యం మాత్రమే ఇచ్చి, మిగతా 3 కిలోల బదులు రాగులు ఇస్తారు. అంటే ఉన్న బియ్యాన్ని తగ్గించి, కొత్త సరుకు పేరుతో మభ్యపెట్టడమేనని ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి.
ఏడాదిగా లబ్ధిదారులకు అందని కందిపప్పు
ఇప్పుడు బియ్యంలోనూ కోత
పట్టించుకోని ప్రభుత్వం
బియ్యం తగ్గించి..రాగులు ఇవ్వడంపై సర్వత్రా విస్మయం
పౌష్టికాహార పంపిణీపై పాలకులకు లేని చిత్తశుద్ధి
అత్యంత కీలకమైన కందిపప్పును ఏడాది కాలంగా ఇవ్వకుండా పేదలకు మొండిచేయి చూపడం దారుణం. పేదవాడికి చౌకగా ప్రొటీన్లు అందించాల్సిన బాధ్యతను చంద్రబాబు ప్రభుత్వం విస్మరించింది. ‘కొత్తగా రాగులు ఇస్తున్నామంటూ ఆర్భాటం చేస్తూ, ఇప్పుడు ఇస్తున్న బియ్యం కోటాలో మూడు కిలోలు తగ్గించడం అన్యాయం. అదనంగా సరుకులు ఇవ్వాల్సింది పోయి, ఉన్న కోటానే తగ్గిస్తున్నారు. ఇది ప్రజలను మోసగించడమే. గోధుమపిండి వంటి కొత్త సరుకులు సరే.. కానీ, ముందుగా ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందే బియ్యం, ఇతర సరుకుల నాణ్యతను పెంచడంపై దృష్టి సారించాలి. కేవలం కొత్త పథకాల పేరుతో పాత లోపాలను కప్పిపుచ్చే ప్రయత్నం మానుకోవాలి. ప్రభుత్వం తక్షణమే కందిపప్పు సరఫరాను పునరుద్ధరించాలి.పాకల సన్యాసిరావు, సీపీఎం, పౌరసరఫరాల సంఘం నాయకుడు, పార్వతీపురం
పేదోడి పళ్లెంలో ప్రోటీన్ మాయం


