కారుణ్య నియామకపత్రం అందజేత
విజయనగరం రూరల్: బాడంగి మండలానికి చెందిన జి.జోజమ్మను గంట్యాడ మండలంలోని వసంత జెడ్పీ ఉన్నత పాఠశాలలో కార్యాలయ సహాయకురాలిగా నియమిస్తూ జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు శుక్రవారం నియామకపత్రం అందజేశారు. బాడంగి మండలం డొంకినవలస పాఠశాలలో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుడు జి.లక్ష్మణరావు మరణించడంతో ఆయన భార్య జోజమ్మకు కారుణ్య నియామకంలో ఉద్యోగం కల్పించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈవో బీవీ సత్యనారాయణ, ఏవో రాజేశ్వరి, తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయి బీచ్ వాలీబాల్ పోటీలకు అలుగోలు విద్యార్థి
నెల్లిమర్ల రూరల్: మండలంలోని అలుగోలు ఉన్నత పాఠశాల విద్యార్థి గణేష్ రాష్ట్రస్థాయి బీచ్ వాలీబాల్ పోటీలకు ఎంపికయ్యాడు. చింతపల్లి సముద్ర తీరంలో ఇటీవల జరిగిన జిల్లా స్థాయి బీచ్ వాలీబాల్ పోటీల్లో అండర్–14 విభాగంలో పాల్గొని సత్తా చాటాడు. ఈ నెల 20 నుంచి బాపట్లలోని సూర్యలంక బీచ్‌లో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీలకు హజరుకానున్నాడు. ఈ మేరకు శుక్రవారం హెచ్‌ఎం కస్తూ రి, పీడీలు ధర్మారావు, మహేశ్వరరావు గణేష్‌ను అభినందించారు. రాష్ట్రస్థాయి పోటీల్లో సత్తా చాటాలని ప్రోత్సహించారు. కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.
14న జిల్లా స్థాయి ఖోఖో పోటీలు
విజయనగరం: జిల్లా ఖోఖో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 14న జిల్లాస్థాయి సీనియర్స్ సీ్త్ర, పురుషుల ఖోఖో పోటీలు నిర్వహించనున్నట్లు అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఏఎంఎన్ కమలనాభ రావు, కె.గోపాల్‌లు తెలిపారు. ఆ రోజు మధ్యాహ్నం 2 గంటలకు నగరంలోని కస్పా కార్పొరేషన్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఎంపిక పోటీలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. పోటీల్లో పాల్గొనేందుకు 2008 జనవరి 1వ తేదీ అనంతరం జన్మించి ఎత్తు, బరువు, వయస్సు కలిపి 250 పాయింట్ల లోపు కలిగి ఉండాలని స్పష్టం చేశారు. జిల్లా స్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి క్రీడాకారులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
హత్యకేసులో ముద్దాయికి జీవిత ఖైదు, జరిమానా
విజయనగరం క్రైమ్: మూడేళ్ల క్రితం జరిగిన హత్య కేసులో ముద్దాయికి జీవిత ఖైదు, రూ.2000 జరిమానా విధిస్తూ జిల్లా జడ్జి ఎం.బబిత తీర్పు ఇచ్చారని ఎస్పీ దామోదర్ శుక్రవారం తెలిపారు. ఈ హత్య కేసు వివరాలిలా ఉన్నాయి. చీపురపల్లికి చెందిన బంగారి రామ్మోహనరావును ఆగస్టు 18, 2022లో గుర్తుతెలియని వ్యక్తి గాయపరిచినట్టు తమ్ముడు వెంకటేష్ స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా అప్పటి ఎస్సై సన్యాసినాయుడు కేసు నమోదు చేశారు. అయితే గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ విషయమై మృతుని తల్లి లక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆల్టరేషన్ మెమో ద్వారా పోలీసులు హత్య కేసుగా నమోదు చేశారు. దీంతో అప్పటి చీపురుపల్లి సీఐ సంజీవరావు కేసు దర్యాప్తు చేపట్టి విచారణ చేసి హత్య నేరానికి పాల్పడినట్లు రాయిపల్లి మురళిని అరెస్ట్ చేసి రి మాండ్ తరలించి కోర్టులో అభియోగ పత్రాలు దాఖలు చేశారు. కోర్ట్ విచారణలో రాయిపల్లి మురళిపై నేరారోపణలు రుజువు కావడంతో వి జయనగరం జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.బబిత పై విధంగా శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించారు.
గుర్తు తెలియని మృతదేహం లభ్యం
విజయనగరం క్రైమ్: విజయనగరం వన్ టౌన్ పీఎస్ పరిధిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు శుక్రవారం గమనించారు. నగరంలోని ఎన్‌సీఎస్ థియేటర్ ఎదురుగా సులబ్ కాంప్లెక్స్‌వద్ద ఫుట్ పాత్‌పై మెరూన్ కలర్ షర్ట్ వేసుకున్న వ్యక్తి మృతిచెంది ఉండడాన్ని సీఐ ఆర్వీఆర్‌కే చౌదరి గుర్తించారు. ఈ మేరకు గుర్తు తెలియని మృతదేహం కేసు నమోదు చేశారు. మృతుడి వివరాలు తెలిసిన వారు వన్ టౌన్‌లో సంప్రదించాలని సీఐ చౌదరి కోరారు.
కారుణ్య నియామకపత్రం అందజేత
కారుణ్య నియామకపత్రం అందజేత


