కంటి తనిఖీ కోసం వెళ్లి మృతి
● మృతుడి నేత్రాలు దానం చేసిన
కుటుంబసభ్యులు
చీపురుపల్లి: ఆ ఇంటి పెద్ద అకాల మరణం కుటుంబాన్ని కుంగదీసింది. చీపురుపల్లిలో బయల్దేరి విజయనగరం కంటి వైద్య పరీక్షల కోసం వెళ్లిన ఆయన గుండెపోటుతో అకస్మాత్తుగా మరణించడంతో ఆ కుటుంబం శోకసంద్రంలోకి వెళ్లిపోయింది. మనిషి లేడనే బాధలో దుఃఖంలో ఉన్నప్పటికీ నేత్రదానం చేసేందుకు ముందుకొచ్చిన ఆ కుటుంబం ఆదర్శం కాగా ఆయన నేత్రాలు సజీవంగా మిగలనున్నాయి. పట్టణానికి చెందిన రిటైర్డ్ డిప్యూటీ ఎంపీడీఓ కర్రోతు అప్పారావు(73) శుక్రవారం ఉదయం విజయనగరంలో కంటి వైద్య పరీక్షల కోసం వెళ్లిన ఆయన ఆకస్మాత్తుగా గుండెపోటు రావడంతో అక్కడే మృతిచెందారు. దీంతో ఆయన మృతదేహాన్ని పట్టణంలోని జి.అగ్రహారం తీసుకొచ్చారు. నేత్రదానం కోసం స్థానిక బాలుర ఉన్నత పాఠశాల పీఎంసీ చైర్మన్ గవిడి సురేష్ మృతుని కుటుంబసభ్యులకు వివరించగా దీనికి వారు అంగీకరించడంతో మానవీయత స్వచ్ఛంద సంస్థ ద్వారా జిల్లా రెడ్‌క్రాస్ నుంచి టెక్నీషియన్ హాజరై మృతుడు అప్పారావు నుంచి కార్నియా సేకరించారు. ఇక్కడ సేకరించిన కార్నియాను విశాఖపట్నంలోని ఎల్‌వీ.ప్రసాద్ ఆస్పత్రికి తరలించినట్లు గోవిందరాజులు తెలిపారు.
విజయనగరం క్రైమ్: ఈ నెల 5న జరిగిన అగ్నిప్రమాదంలో గాయాలపాలైన నిండు గర్భిణి మౌనిక (28) కేజీహెచ్‌లో చిక్సిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందినట్లు టూ టౌన్ ఎస్సై చంద్ర తెలిపారు. వివరాల్లోకి వెళ్తే..తోటపాలెంకు చెందిన గర్భిణి మౌనిక లంకాపట్నంలోని కన్నవారింటికి వచ్చింది. ఇంట్లో వంట చేస్తుండగా నైటీకి నిప్పంటుకోవడంతో ప్రమాదం సంభవించింది. దీంతో చికిత్స నిమిత్తం విశాఖ కేజీహెచ్‌కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది.


