చింతూరు బస్సు దుర్ఘటనపై దిగ్బ్రాంతి
● మృతుల కుటుంబాలకు రూ.15 లక్షలు,
● క్షతగాత్రులకు రూ.5 లక్షలు ప్రభుత్వం
అందించాలి
● మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర
సాలూరు: అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం తులసిపాకలు ఘాట్‌రోడ్డులో బస్సు ప్రమాద దుర్ఘటనపై మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం సాలూరు పట్టణంలోని తన స్వగృహంలో విలేకరులతో ఆయన మాట్లాడారు.భద్రాచలం నుంచి అన్నవరం వెళ్తున్న యాత్రికుల ప్రైవేట్ బస్సు లోయలో పడి పలువురు మృతిచెందడం బాధాకరమన్నారు. ఈ దుర్ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం మానవత్వంతో స్పందించి ,శ్రీకాకుళంలోని కాశీబుగ్గ వేంకటేశ్వరస్వామి ఆలయంలో మరణించిన భక్తులకు రూ.15 లక్షలు ఇచ్చినట్లే, తీర్థయాత్రలకు వెళ్తూ మరణించిన భక్తులకు ఒక్కొక్కరికి రూ.15 లక్షలకు తక్కువ కాకుండా ఇవ్వాలన్నారు. కేంద్రప్రభుత్వం రూ.2 లక్షలు ఇవ్వాలని విజ్ఙప్తి చేశారు. ఈ ప్రమాదంలో క్షతగాత్రులకు ప్రభుత్వమే ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స అందించడంతో పాటు వారికి రూ.5 లక్షలు చొప్పున పరిహారం ఇవ్వాలన్నారు. ఈ రహదారిలో భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా సంబంధిత అధికారులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చర్యలు చేపట్టాలని కోరారు.


