విశాఖ నుంచి వస్తూ కారు ప్రమాదం
పాలకొండ రూరల్: మండలంలోని అట్టలి గ్రామ మలుపు వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదం స్థానికులను భయోత్పాతానికి గురిచేసింది. విశాఖ నుంచి దంపతులు పాలకొండ వయా పార్వతీపురం మీదుగా జియమ్మవలసకు తమ కారులో వెళ్తుండగా అట్టలి మలుపు దగ్గరకు చేరుకుంటున్న క్రమంలో వారి కారు అదుపు తప్పి కుడివైపు పంటపొలాల్లోకి దూసుకువెళ్లబోతూ అక్కడే ఉన్న విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో నవగాం విద్యుత్ సబ్‌స్టేషన్ ద్వారా గ్రామాలకు విద్యుత్ సరఫరా చేసే 11–కేవీ విద్యుత్ స్తంభం విరిగిపోయింది. నిప్పులు చిమ్ముతూ సిమెంట్ స్తంభం కారుపైకి ఒరిగిపోవటంతో అక్కడివారు తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. అదృష్టవశాత్తు కారు ముందు భాగం నుజ్జవడం మినహా అందులో ప్రయాణిస్తున్న దంపతులకు ఎటువంటి గాయాలు కాలేదు. స్థానికుల సహాయంతో దంపతులు సురక్షితంగా బయటపడి స్వగ్రామం పయనమయ్యారు. విద్యుత్ శాఖ అధికారులు నిలిచిపోయిన విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు.


