ప్రజా వైద్యం.. ప్రజల హక్కు
విజయనగరం రూరల్: పేద, బడుగు, బలహీన వర్గాలకు ఉచితంగా మెరుగైన వైద్యం, వైద్యవిద్య అందించాలనే ధ్యేయంతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా 17 వైద్య కళాశాలలను ఏర్పాటు చేస్తే, చంద్రబాబు సర్కారు వాటిని నిర్వీర్యం చేసేందుకు చూస్తోందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మండిపడ్డారు. విజయనగరంలోని తన నివాసంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రజావైద్యం ప్రజల హక్కు అని, విద్య, వైద్యం ప్రభుత్వ ఆధీనంలోనే జరగాలన్నారు. చంద్రబాబు సర్కారు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. వైద్యకళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీగా ప్రజల పక్షాన పోరాటం చేస్తామన్నారు. ప్రభుత్వ ఆధీనంలో మెడికల్ కళాశాలలు ఉంటే 500 పడకల ఆస్పత్రి అనుసంధానంగా ఉంటుందని, చంద్రబాబు సర్కారు తీరుతో విజయనగరం ప్రభుత్వాస్పత్రి నిర్లక్ష్యానికి గురవుతోందన్నారు.
ర్యాలీ విజయవంతం చేయాలి
వైద్యకళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో వైఎస్సార్‌సీపీ సమన్వయకర్తలు, నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించిన సంతకాల ఉద్యమానికి 4 లక్షల మందికి పైబడి మద్దతు తెలిపారన్నారు. సేకరించిన సంతకాల ప్రతులతో ఈ నెల 15న జిల్లా కేంద్రంలో భారీర్యాలీ నిర్వహిస్తామన్నారు. విజయనగరంలోని సీఎంఆర్ కూడలి సమీపంలోని వైఎస్సార్ విగ్రహం నుంచి ఉదయం 10 గంటలకు ర్యాలీ ప్రారంభమవుతుందని తెలిపారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న ర్యాలీలో విద్యార్థి, ఉద్యోగ, వ్యాపార, మేధావివర్గాలు, విద్యావంతులు, రాజకీయ పార్టీలు, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శులు నెక్కల నాయుడుబాబు, కె.వి.సూర్యనారాయణరాజు, జిల్లా ఉపాధ్యక్షుడు సత్తిబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శులు వర్రి నరసింహమూర్తి, రవికుమార్, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు పి.జైహింద్‌కుమార్, జెడ్పీటీసీ సభ్యుడు శీర అప్పలనాయుడు, తదితరులు పాల్గొన్నారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం పేద విద్యార్థులకు వరం
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అందుబాటులోకి తెచ్చిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం వల్ల ఎంతోమంది పేద విద్యార్థులు డాక్టర్లు అయ్యారని జెడ్పీ చైర్మన్ తెలిపారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనా కాలంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకానికి ఎటువంటి ఆంక్షలు లేకుండా అమలు చేసినట్టు వెల్లడించారు. గ్రామాల్లో 24 గంటలు వైద్యసేవలందించాలనే ధ్యేయంతో వెల్‌నెస్ కేంద్రాలు ఏర్పాటు చేస్తే.. చంద్రబాబు సర్కారు వాటిని నిర్వీర్యం చేసిందన్నారు. కోవిడ్ వంటి మహమ్మారిని ఎదుర్కోవడం జగన్‌మోహన్‌రెడ్డి సమర్థవంతమైన పాలనకు నిదర్శనమన్నారు. స్క్రబ్స్‌టైఫస్ వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించడంలో చంద్రబాబు సర్కారు విఫలమైందన్నారు.
వైఎస్ జగన్ పాలనలో విద్య, వైద్యానికి పెద్దపీట
విద్య, వైద్యం ప్రభుత్వ ఆధీనంలో
ఉండాలి
వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు
వ్యతిరేకంగా జిల్లాలో 4 లక్షలకు పైగా సంతకాల సేకరణ
ఈ నెల 15న జిల్లా కేంద్రంలో
సంతకాల ప్రతులతో భారీ ర్యాలీ
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు


