రైతు కష్టం మిల్లర్ల పాలు..!
విజయనగరం ఫోర్ట్: ఆరుగాలం శ్రమించి రైతులు పండించిన వరి పంటను కొందరు మిల్లర్లు దోచుకుంటున్నారు. తరుగు పేరుతో బస్తాకు 4 నుంచి 6 కేజీల వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. రైతు కష్టాన్ని సొమ్ముచేసుకుంటున్నారు. మిల్లుకు తీసుకెళ్లిన ధాన్యంలో కోత వేయడం వల్ల ఎకరానికి రూ.2 వేలు నుంచి రూ.3 వేలు వరకు రైతులు నష్ట పోతున్నారు. దీనిపై ప్రశ్నిస్తే తేమ శాతం ఎక్కువగా ఉందంటూ బుకాయిస్తున్నారు. ధాన్యం దింపేది లేదంటూ హెచ్చరిస్తున్నారు. చేసేదిలేక రైతులు మిన్నకుంటున్నారు. ట్రక్ షీట్‌లో 40 కేజీలుగా కొనుగోలు కేంద్రం సిబ్బంది నమోదు చేస్తుండగా, మిల్లు వద్ద 41 కేజీలు చొప్పన ధాన్యం లెక్కిస్తున్నారు. ప్రశ్నించేవారికి గోనె సంచు బరువు అని మిల్లర్లు చెబుతున్నారు. గోనె సంచి బరువు 50 గ్రాములకు మించి ఉండదు. 80 కేజీల బస్తాకు గోనెపేరు 2 కేజీలు అదనంగా తీసుకుంటున్నారు. తేమశాతం పేరుతో మరో 2 నుంచి 4 కేజీల వరకు తీసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇదే విషయంపై జిల్లా వ్యవసాయాధికారి వి.తారకరామా రావు స్పందిస్తూ ధాన్యం అదనంగా తీసుకున్న మిల్లులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.
గంట్యాడ మండలంలోని ఓ రైస్ మిల్లు వద్ద ధాన్యం బస్తాలతో బారులు తీరిన వాహనాలు


