పరువు పాయె..! | - | Sakshi
Sakshi News home page

పరువు పాయె..!

Dec 12 2025 6:01 AM | Updated on Dec 12 2025 6:01 AM

పరువు పాయె..!

పరువు పాయె..!

సాక్షి, పార్వతీపురం మన్యం:

జిల్లాకు చెందిన రాష్ట్ర సీ్త్ర శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి.. పని తీరులో కంటే వివాదాల్లోనే టాప్‌లో ఉంటారన్న విషయం మరోసారి రుజువైంది. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబే మంత్రి పనితీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం. ఫైళ్లను వేగంగా క్లియర్‌ చేసిన మంత్రుల్లో సంధ్యారాణి 19వ స్థానంలో నిలవడం గమనార్హం. రెండు కీలక శాఖలను చూస్తున్న ఆమె.. 5–7–2024 నుంచి 9–12–2025 వరకు (17 నెలల్లో) తన పరిధిలో పరిష్కరించిన ఫైళ్లు 545. ఒక్కో దరఖాస్తు పరిష్కారానికి సగటున 8 రోజుల 8 గంటల 20 నిమిషాల చొప్పున తీసుకున్నారు. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న గిరిజన సంక్షేమ శాఖలో ఒక్కో దస్త్రం పరిష్కారానికి 12 రోజులు చొప్పున తీసుకోవడం విశేషం. ‘గిరిజనులంటేనే వెనుకబడిన వారు. వారిని మీరు మరింత వెనుకబాటులోకి నెట్టేస్తున్నార’ని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించడం మన మంత్రి పనితీరుకు అద్దం పడుతోంది.

మంత్రి గుమ్మిడి సంధ్యారాణి.. జిల్లా అభివృద్ధిలోనూ, తాను ప్రాతినిథ్యం వహిస్తున్న శాఖల సంక్షేమంలోనూ చూపే శ్రద్ధ కంటే... వివాదాలపైనే ఎక్కువగా దృష్టి పెడతారన్న విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ప్రత్యర్థులను విమర్శించడం, దూషించడానికే ఆమె ప్రాధాన్యమిస్తున్నారు. వీలు దొరికినప్పుడల్లా మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని, వైఎస్సార్‌సీపీని దూషించడానికే సంధ్యారాణికి మంత్రి పదవి ఉందన్న విమర్శలు సొంత పార్టీ నుంచే వినిపిస్తున్నాయి. దీనికితోడు.. ఆమె అనధికార పీఏ, కుమారుడి వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సీ్త్రశిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఉండి.. సొంత నియోజకవర్గంలోని మహిళా ఉద్యోగినికే న్యాయం చేయలేకపోయారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి సైతం ఆగ్రహం వ్యక్తం చేశారని వినిపించింది. ఆమె అనధికార పీఏ ఆగడాలపై బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించినప్పటికీ.. ఇప్పటి వరకు న్యాయం జరగలేదు. మక్కువ మండలం డి.శిర్లాం ఆశ వర్కరు మృతి వెనుక కూడా టీడీపీ నాయకుల వేధింపులు ఉన్నాయని బాధిత కుటుంబ సభ్యులు ఇటీవల కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. తాము మంత్రి కాళ్ల మీద పడి ప్రాథేయపడినా కనికరం చూపలేదని వారు వాపోయారు. మరోవైపు మంత్రి కారు డ్రైవర్‌ సామాజిక మాధ్యమాల వేదికగా తనను వేధిస్తున్నాడని మాజీ మంత్రి రాజన్నదొర వ్యక్తిగత సహాయకుడు ఇటీవల ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు. ఇలా వరుస వివాదాల వల్ల ఇటీవల ముఖ్యమంత్రి పర్యటనలోనూ ఆమెకు ఆహ్వానం అందలేదని జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. అభివృద్ధిని, సంక్షేమాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి.. కేవలం కక్షసాధింపు రాజకీయాలు, చిరుద్యోగుల తొలగింపులకే ప్రాధాన్యమిస్తున్నారన్న విమర్శలున్నాయి.

వివాదాల్లోనే మంత్రి టాప్‌..

పౌరసేవల్లో

మనం ఎక్కడో..!

ఫైళ్ల క్లియరెన్స్‌లో వెనుకబాటు

సమస్యల పరిష్కారంలో అలసత్వం!

రాష్ట్రంలోని మంత్రుల్లో సంధ్యారాణిది 19వ స్థానం

వివాదాల్లోనే టాప్‌లో ఉంటారన్న

విమర్శలు

పౌరసేవల్లోనూ కానరాని చొరవ

జిల్లాలో ఇంటబయటా విమర్శలు

మరోవైపు పుర, నగరపాలక సంస్థల్లో ప్రజలకు అందిస్తున్న పౌరసేవల్లోనూ పార్వతీపురం మన్యం జిల్లా బాగా వెనుకంజలో ఉంది. పురపాలిక, నగర పంచాయతీల్లో ఇళ్ల నుంచి వ్యర్థాల సేకరణ, తాగునీటి సరఫరా, మురుగునీటి శుద్ధి, రహదారుల నిర్మాణం, వీధి దీపాల నిర్వహణ, స్వయం సహాయ సంఘాలకు ఆర్థిక సాయం, ఆస్తి పన్నుల వసూళ్లు తదితర ఎనిమిది అంశాలను మదింపు చేసి ర్యాంకులు కేటాయించారు. మొదటి పది స్థానాల్లో జిల్లా చోటు దక్కించుకోలేకపోయింది. అసలే వెనుకబడిన జిల్లా.. ఆపై జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయలోపం వల్ల పార్వతీపురం మన్యం ఏ విధంగానూ ముందడుగు వేయలేకపోతోందని గిరిజన సంఘాల నాయకులు అంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement