పాపం పసివాళ్లు..!
జామి: జామి మండలం జన్నివలస గ్రామానికి చెందిన పైలపల్లి పైడిరాజు, దేవి దంపతులకు ఇద్దరు కుమారులు విజయ్(12), గౌతమ్(10). విజయ్ జామి జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాలలో 7వ తరగతి, గౌతమ్ జన్నివలస ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నారు. తండ్రి పైడిరాజు వారి చిన్నతంలోనే మృతిచెందాడు. అప్పటి నుంచి తల్లి దేవి కూలిపనులు చేస్తూ ఇద్దరు కుమారులను సాకుతూ వచ్చింది. విధి ఆ కుటుంబపై పగబట్టింది. ఏడు నెలల కిందట దేవి గుండెపోటుతో మృతిచెందింది. తల్లిదండ్రుల మృతితో ఇద్దరు చిన్నారులు అనాథలుగా మిగిలారు. జీవనానికి ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం, రాత్రి పస్తులుంటూ.. పాఠశాలలో పెట్టిన ఒక్కపూట మధ్యాహ్నభోజనంతోనే సరిపెట్టుకుంటున్నారు. పాఠశాలకు సెలవు అయితే ఆ రోజు ఆకలితో అలమటించాల్సిన పరిస్థితి. వారి పెద్దమ్మ కొండమ్మ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే అయినా.. చిన్నారుల దుస్థితి చూసి అప్పుడప్పుడు కాస్త ఆకలి తీర్చుతోంది. ఇద్దరు చిన్నారులు ఊరిలో ఉన్న పూరిగుడిసెలో బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. చదువుకుంటే ప్రయోజకులవుతారన్న తల్లి మాటను గుర్తుచేసుకుంటూ ప్రతిరోజు పాఠశాలకు వెళ్తున్నారు. తల్లిదండ్రులు ఇద్దరూ మృతిచెందడంతో ప్రభుత్వం ఇస్తున్న తల్లికి వందనం పథకం కూడా వీరికి వర్తించలేదు. తల్లి బయోమెట్రిక్ ఉండాలన్న నిబంధన వీరికి శాపంగా మారింది.
దుస్తులు కొందామంటే డబ్బులు లేవు...
మాకు ఎవరూ లేరు. సంక్రాంతికి బట్టలు కొనుక్కుందామన్నా, అమ్మకి, నాన్నకి సంక్రాంతికి దుస్తులు కొని చూపుదామన్నా డబ్బులు లేవు. వర్షం కురిస్తే పూరిగుడిసె మొత్తం కారిపోతోంది. పుస్తకాలు తడిసిపోతున్నాయి. రాత్రిపూట నిద్రపోవాలంటేనే భయం వేస్తోంది. పాఠశాలలో పెట్టిన మధ్యాహ్న భోజనంతోనే ఆకలి తీర్చుకుంటున్నాం. ఉదయం, రాత్రి భోజనం ఉండదు. చక్కగా చదువుకోవాలని అమ్మ చెప్పింది. అందుకే.. ప్రతిరోజు పాఠశాలకు వెళ్తున్నాం. ఉన్నతాధికారులు, దాతలు స్పందించి తమను ఆదుకోవాలంటూ చిన్నారులు రెండు చేతులూ జోడించి ప్రార్థిస్తున్నారు. ఆదుకునే హస్తం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.
ఒక్కపూట భోజనం..
పూరిగుడిసే ఆవాసం
తల్లిదండ్రుల మృతితో అనాథలైన
చిన్నారులు
ఒకరికి ఒకరు తోడుగా పూరిగుడిసెలో నివాసం
పాఠశాలలో పెట్టిన మధ్యాహ్నభోజనంతోనే జీవనం
తిండిలేక పస్తులతో అల్లాడుతున్న
చిన్నారులు
ఆపన్నహస్తం కోసం ఎదురుచూపు
సహాయం చేయాల్సిన వారు
సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ :
76740 96919


