బైక్ అదుపుతప్పి యువకుడి మృతి
సీతంపేట: మండల కేంద్రం సీతంపేటకు చెందిన యువకుడు శేషపు చంద్రశేఖర్ (23) గడిగుడ్డి సమీపంలో జరిగిన బైక్ అదుపుతప్పి గురువారం వేకువ జామున మృతిచెందాడు. బుధవారం రాత్రి ఐటీడీఏ నుంచి సీతంపేటలో తాను నివాసముంటున్న ఎస్టీ కాలనీకి ద్విచక్రవాహనంపై వస్తుండగా మార్గమధ్యంలో గడిగుడ్డి సమీపానికి వచ్చేసరికి వాహనం అదుపుతప్పి కిందపడడంతో తలకు బలమైన గాయాలయ్యాయి. వెంటనే 108లో స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించగా వైద్యులు ప్రాథమిక చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం జెమ్స్‌కు రిఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ తెల్లారు జామున మృతిచెందినట్లు ఎస్సై వై.అమ్మన్నరావు తెలిపారు. మృతుడికి తండ్రి గోవిందరావు, సోదరుడు వంశీ ఉన్నారు. యువకుడి మృతివార్త విన్న కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు. అందరితోనూ సరదాగా ఉంటూ, మంచికి మారుపేరైన చంద్రశేఖర్ అకస్మాత్తుగా మృతిచెందడంతో స్థానికులు జీర్ణించుకోలేకపోతున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై చెప్పారు.


