పెన్షన్ పంపిణీలో ‘విద్యుత్ షాక్’..!
బలిజిపేట: మండలంలోని పలగర పంచాయతీ గుడివాడ కాలనీలో లింగాల అసరయ్యకు ఈనెల పింఛన్ పంపిణీ చేస్తూ విద్యుత్ బిల్లు షాక్ ఇచ్చారు ఆ శాఖ అధికారులు. విద్యుత్ బిల్లులో వెయ్యి రూపాయలను విద్యుత్‌శాఖ సిబ్బంది కట్‌చేసినట్లు బాధితుడు వాపోయాడు. గుడివాడకాలనీకి చెందిన దళితుడు ఎల్.అసిరయ్యకు గతనెల విద్యుత్ రీడింగ్ తీయగా రూ.5వేలకు పైగా బిల్లు రావడంతో డిసెంబరు నెలలో అసిరయ్యకు పింఛన్ ఇచ్చే సమయంలో విద్యుత్‌శాఖ సిబ్బంది విద్యుత్ బిల్లులో పాక్షికంగా వెయ్యి రూపాయలు కట్ చేసి తీసుకున్నారు. పింఛన్‌లో ఈ విధంగా విద్యుత్ బిల్లు బకాయి విరుపుకోవడంపై బాధితుడు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాడని సీఐటీయూ నాయకుడు మన్మథరావు తెలిపారు. దీనిపై ఆయన మాట్లాడుతూ ఎటువంటి ఆధారం లేక వచ్చిన పింఛన్‌పై బతుకుతున్న నిరుపేద కుటుంబాలకు చెందిన దళితుల వద్ద ఈ విధంగా డబ్బులు వసూలు చేయడం దారుణమన్నారు.
విజయనగరం క్రైమ్: విజయనగరం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయితో పట్టుబడిన ఇద్దరు యువకులను ఎస్సై అశోక్ గురువారం అరెస్టు చేశారు. చెల్లూరు సమీపంలో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు యువకులను తనిఖీ చేసి విచారణ చేసి అక్రమంగా 5 కేజీల గంజాయిని రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. దీంతో ఆ ఇద్దరు యువకులపై కేసు నమోదు చేసి ఫింగర్ ప్రింట్స్ తీసుకుని కోర్టుకు తరలిస్తున్నట్లు ఎస్సై అశోక్ చెప్పారు.


