ఆటో బోల్తా: ఎనిమిదిమందికి గాయాలు
కురుపాం: జిల్లాలోని సీతంపేట మండలం చింతమానుగూడ గ్రామానికి చెందిన పదిమంది కురుపాం మండలం సూర్యనగరం గ్రామానికి బంధువుల ఇంటికి ఆటోలో వస్తుండగా రస్తాకుంటుబాయి గ్రామసమీపంలో ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ సంఘటనలో 8 మందికి గాయాలు కాగా స్థానికులు 108 వాహనంలో కురుపాం సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు, వైద్యులు ప్రాథమిక చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఎవరికీ ఎటువంటి ప్రాణహాని లేదని వైద్యులు తెలిపారు.
● ఓ విద్యార్థికి గాయాలు
రాజాం సిటీ: మండల పరిధి కొత్తపేట జంక్షన్ నుంచి అరసబలగ వెళ్లే దారిలో గురువారం ఆటోను స్కూల్ బస్సు ఢీకొంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తెర్లాం మండలంలోని మాదంభట్లవలస, అరసబలగ గ్రామాల నుంచి స్కూల్ విద్యార్థులు ఆటోలో రాజాం వస్తున్నారు. అదే సమయంలో ఎదురుగా వస్తున్న స్కూల్ బస్సు ఆటోను ఢీకొంది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న విద్యార్థి చింతా దుర్గాప్రసాద్ కుడిచేతికి తీవ్రగాయమైంది. వెంటనే రాజాంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా వైద్యులు అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నం రిఫర్ చేశారు. ఆటో డ్రైవర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్సై పి.జనార్దనరావు తెలిపారు.


