వృద్ధురాలికి అరుదైనశస్త్రచికిత్స
● విజయవంతంగా నిర్వహించిన సర్వజన ఆస్పత్రి వైద్యురాలు
విజయనగరం ఫోర్ట్: ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో వృద్ధురాలికి ఎముకలవైద్యులు అరుదైన శస్త్రచికిత్స నిర్వహించారు. దీనికి సంబంధించి ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అల్లు పద్మజ వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. లక్ష్మీకాంతం అనే 74 ఏళ్ల వృద్ధురాలికి 15 ఏళ్ల క్రితం ఎడమ కాలు విరిగితే విశాఖపట్నం కేజీహెచ్‌లో ఆపరేషన్ చేసి కృత్రిమ తుంటి ఎముక వేశారు. అయితే కొద్ది రోజుల క్రితం బూత్‌రూమ్‌లో ఆమె కాలు జరి పడిపోవడంతో మళ్లీ తుంటి ఎముక విరిగిపోయింది. పలు ప్రైవేట్ ఆస్పత్రులకు తిరిగినప్పటికీ ఎవరూ చేయలేమని చెప్పడంతో ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో వృద్ధురాలు చేరింది. ఆస్పత్రిలో ఆమెకు వైద్య పరీక్షలు చేయగా హెచ్‌బి 5 గ్రాములు ఉండడంతో 5 యూనిట్లు రక్తం ఎక్కించారు. క్లిష్టతరమైన శస్త్రచికిత్సను ఆర్ధో విభాగం హెచ్‌ఓడీ డాక్టర్ లోక్‌నాఽథ్, తోటి ఎముకల వైద్యురాలు, మత్తు వైద్యుల సహాయంతో ఆపరేషన్ విజయవంతం గా నిర్వహించారు. పాత కృతిమ తుంటి ఎముక తీసివేసి కొత్తది వేశారు.


