’కానిస్టేబుల్ కుటుంబానికి రూ. 10 లక్షల చెక్కు అందజేత
పార్వతీపురం రూరల్: విధి చిన్న చపు చూసినా పోలీసు శాఖ మాత్రం ఆ కుటుంబానికి పెద్ద దిక్కులా నిలిచింది. బ్రెయిన్ కేన్సర్‌తో పోరాడి ఇటీవల మృతిచెందిన సీతంపేట కానిస్టేబుల్ పాడి బాబూరావు కుటుంబానికి ఎస్‌బీఐ శాలరీ ప్యాకేజీ అండగా నిలిచింది. ప్యాకేజీ నిబంధనల ప్రకారం మంజూరైన రూ.10 లక్షల బీమా చెక్కును ఎస్పీ ఎస్‌వీ మాధవ్ రెడ్డి మృతుని సతీమణి మాధురికి గురువారం అందజేసి ధైర్యం కల్పించారు. ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.కోటి, సాధారణ మరణానికి రూ.10లక్షల సాయం అందుతుందని, ఈ మొత్తాన్ని కుటుంబ అవసరాలకు పొదుపుగా వాడుకోవాలని ఎస్పీ సూచించారు. బాధితులకు శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. కార్యక్రమంలో ఏఆర్‌డీఎస్పీ థామస్ రెడ్డి, పాలకొండ ఎస్‌బీఐ మేనేజర్ హిమాన్షు తదితరులు పాల్గొన్నారు.


