వసతి గృహాలకు గ్రహణం
● అగమ్యగోచరంగా ఆశ్రమ పాఠశాలలు
● అనాథల్లా మారిన విద్యార్థులు
● కొరవడిన అధికారుల పర్యవేక్షణ
● జిల్లాలో సగం మంది వార్డెన్లే లేరు
పార్వతీపురం రూరల్: జిల్లాలోని వసతి గృహాలు సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నాయి. పేద విద్యార్థులకు ఆసరాగా నిలవాల్సిన ఆశ్రమ పాఠశాలలు, పాలకుల నిర్లక్ష్యంతో అవస్థల నిలయాలుగా మారుతున్నాయి. ‘బడికి పంపిస్తే బుద్ధి నేర్చుకుంటారు‘ అని తల్లిదండ్రులు ఆశపడితే..అక్కడ పర్యవేక్షణ కొరవడి విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతోంది. ప్రధానంగా చంద్రబాబు నేతృత్వంలోని ఈ ప్రభుత్వం వసతి గృహాల నిర్వహణను గాలికి వదిలేసిందనడానికి జిల్లాలో నెలకొన్న పరిస్థితులే సాక్ష్యంగా నిలుస్తున్నాయి.
భయంతో పరుగులు..చీకటిలో ఆక్రందనలు
విద్యాలయాలు విజ్ఞానాన్ని పంచాల్సింది పోయి, రౌడీయిజానికి అడ్డాగా మారుతున్నాయి. తాజాగా కొమరాడ మండలం పెదఖేర్జిల గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలలో జరిగిన ఘటనే ఇందుకు తార్కాణం. సెల్‌ఫోన్ అనే చిన్న కారణంతో జూనియర్లపై సీనియర్లు విచక్షణారహితంగా దాడి చేయడం, ఆ దెబ్బలకు తట్టుకోలేక, ప్రాణభయంతో ఇద్దరు విద్యార్థులు అర్ధరాత్రి వేళ కాలినడకన ఇరవై, ముప్పై కిలోమీటర్లు పరుగులు తీయడం..వసతి గృహాల్లోని భద్రతా డొల్లతనానికి అద్దం పడుతోంది. ఆదుకోవాల్సిన యంత్రాంగం గాఢనిద్రలో ఉండడం గమనార్హం.
సంరక్షకులు కరువు..సమస్యలు బరువు
జిల్లావ్యాప్తంగా ఎస్సీ, బీసీ, ఎస్టీ వసతి గృహాలు 116 వరకు ఉండగా, సుమారు 28 వేల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. అయితే వారిని కంటికి రెప్పలా కాపాడాల్సిన వార్డెన్ల కొరత తీవ్రంగా వేధిస్తోంది. జిల్లాలో 65 గిరిజన ఆశ్రమ పాఠశాలలు ఉంటే, అందులో సగం చోట్ల కూడా సంరక్షకులు (వార్డెన్లు) లేకపోవడం శోచనీయం.వార్డెన్ లేని చోట విద్యార్థులకు దిక్కు ఎవరు? అనే ప్రశ్నకు అధికారుల వద్ద సమాధానం లేదు. దీంతో పిల్లలపై పర్యవేక్షణ ’శూన్యం’గా మారింది. ఫలితంగా క్రమశిక్షణ గాడితప్పుతోంది.
ప్రభుత్వ వైఫల్యం..బాలల భవితకు గండం
చంద్రబాబు ప్రభుత్వం విద్యావ్యవస్థపై చేస్తున్న గొప్ప ప్రకటనలకు, క్షేత్రస్థాయిలో ఉన్న దుస్థితికి పొంతనే లేదు. వందల మంది విద్యార్థులు ఉన్న చోట కనీస పర్యవేక్షణ కల్పించడంలో ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా విఫలమైంది. సంరక్షకులను నియమించడంలో తాత్సారం, ఉన్న సిబ్బందిపై నియంత్రణ లేకపోవడం..వెరసి వసతి గృహాలు అరాచకానికి ఆనవాళ్లుగా మారుస్తున్నాయి. ఇప్పటికై నా ప్రభుత్వం కళ్లు తెరిచి, ఖాళీగా ఉన్న వార్డెన్ పోస్టులను భర్తీ చేసి, పటిష్టమైన పర్యవేక్షణ చేపట్టకపోతే.. మరిన్ని ‘పెదఖేర్జిల‘ ఘటనలు పునరావృతమయ్యే ప్రమాదం పొంచి ఉంది.
సర్కారు నిర్లక్ష్యానికి పరాకాష్ట
పేద విద్యార్థుల ప్రాణాలంటే ప్రభుత్వానికి పూచికపుల్లతో సమానమైంది. వసతిగృహాల్లో వార్డెన్లను ని యమించకుండా, పర్యవేక్షణను గాలికి వదిలేయడం వల్లే నేడు విద్యార్థులు అనాథలుగా మారుతున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపం, ప్రభుత్వ ఉదాసీనత వల్లే వసతి గృహాల్లో సీనియర్లు రౌడీల్లా ప్రవర్తిస్తున్నారు. బడికి వెళ్లిన బిడ్డలు అర్ధరాత్రి ప్రాణభయంతో రోడ్లపై పరుగులు తీస్తుంటే ఈ ప్రభుత్వానికి కనీసం చీమకుట్టినట్టయినా లేదు. తక్షణమే ఖాళీగా ఉన్న వార్డెనన్ పోస్టులను భర్తీ చేసి, బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఇప్పటికై నా సరిపడా సిబ్బందిని నియమించాలి, అలాగే సంబంధిత శాఖ పరమైన ఉన్నతాధికారులు క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకుంటూ, ఆకస్మిక తనిఖీలు వసతి గృహాల్లో నిర్వహించాలి. బి.రవికుమార్ ఏఐఎస్‌ఎఫ్ జిల్లా
ప్రధాన కార్యదర్శి, పార్వతీపురం మన్యం జిల్లా
వసతి గృహాలకు గ్రహణం


