నేల బావిలో పడి వ్యక్తి మృతి
రామభద్రపురం: మండలకేంద్రంలోని దిగువ హరిజన వీధికి చెందిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు నేల బావిలో పడి మృతిచెందాడు. బుధవారం జరిగిన ఈ సంఘటనపై పోలీసులు తెలిపిన వివరాలు మేరకు రామభద్రపురం దిగువ హరిజన వీధికి చెందిన రేజేటి మురళి(33) బహిర్భూమికి వెళ్లి ప్రమాదవశాత్తు నేల బావిలో పడి మృతిచెందాడు. భార్య పెంటమ్మ ఫిర్యాదు మేరకు ఎస్సై వి.ప్రసాదరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాడంగి సీహెచ్‌సీకి తరలించారు. మురళి స్థానిక అంతరరాష్ట్ర కూరగాయల మార్కెట్‌లో వ్యాపారులకు చెందిన కూరగాయల బస్తాలు మూతలు కుడుతూ వచ్చిన కూలి డబ్బులతో కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కుటుంబ పెద్ద దికు కోల్పోవడంతో కుటుంబ జీవనం సాగేదెలా అని కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు.


