వ్యవసాయంలో యాంత్రీకరణ
● కూలీల కొరతను అధిగమించేందుకు రైతుల మొగ్గు
విజయనగరం ఫోర్ట్: వ్యవసాయం పూర్తిగా వ్యయసాయంగా మారుతున్న ప్రస్తుత తరుణంలో రైతులు సాగు ఖర్చు తగ్గించుకునే విధంగా అలోచిస్తున్నారు. ముఖ్యంగా వ్యవసాయ కూలీల కొరతతో పాటు కూలీల ధరలు పెరగడంతో రైతులు యాంత్రీకరణవైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా వరి పంటలో యాంత్రీకరణను వినియోగించుకుంటున్నారు. వరి పంటలో కోత సమయంలో సాగు ఖర్చు పెరిగింది. యంత్రాల ద్వారా వరి కోతలు చేపట్టడం వల్ల రైతులకు డబ్బులు కూడా ఆదా అవుతున్నాయి. జిల్లాలో ముమ్మురంగా వరి కోతలు జరుగుతున్నాయి. దీంతో జిల్లాలోని అన్ని మండలాల్లోనూ వరి కోత యంత్రాల ద్వారా వరి పంటను కోస్తున్నారు. జిల్లాలో 1.25 లక్షల హెక్టార్లలో వరి పంట సాగైంది. ఇప్పటి వరకు 60 శాతం వరకు కోతలు అయ్యాయి.
పెరిగిన కూలీ ధరలు
వరి పంటను కోసే కూలీల ధరలు పెరిగాయి. కూలీల ద్వారా కోయడానికి ఎకరాకి రూ. 4 వేల నుంచి రూ.5 వేల వరకు తీసుకుంటున్నారు. మళ్లీ ఆపంటను పొలం నుంచి కళ్లానికి తీసుకురావడానికి మరో రూ.5 వేల వరకు ఖర్చవుతుంది. పంటను నూర్పు చేయడానికి ట్రాక్టర్, కూలీలకు మరో రూ.5 వేలు వరకు ఖర్చవుతుంది. మొత్తంగా వరిపంటను కోయడానికి, మోయడానికి, నూర్చడానికి రూ.14 వేల నుంచి రూ.15 వేల వరకు ఖర్చు పెట్టాల్సి వస్తోంది.
యంత్రం ద్వారా ఎకరాకి రూ.3500
వరి పంటను వరికోత యంత్రం ద్వారా కోయడానికి కేవలం రూ. 3500 సరిపోతుంది. కోత, మోత, నూర్పు లేకుండా నేరుగా వరి కోత యంత్రం ద్వారా కోయడం వల్ల నేరుగా ధాన్యం వచ్చేస్తాయి. దీంతో ఎకరాకి రైతుకు రూ.10, 500 నుంచి రూ.11,500 రకు మిగులుతుంది. దీంతో రైతులు యంత్రాలు ద్వారా కోయడానికి అసక్తి చూపుతున్నారు.
కూలీల అవసరం లేదు
వరిపంటను కోయడానికి, మోయడానికి, నూర్పుచేయడానికి కూలీలు దొరక్క ఇబ్బంది పడేవాడిని. రెండేళ్లుగా వరికోత యంత్రాలు రావడం వల్ల కూలీల కోసం వెతుక్కోవాల్సిన అవసరం తీరింది. ఒక్క రోజులోనే ధాన్యం కళ్లానికి వచ్చేస్తున్నాయి.
– కె.అప్పలనాయుడు, రైతు, రాకోడు గ్రామం
రెండేళ్లుగా మిషన్‌తోనే కోత
గడిచిన రెండేళ్లుగా మిషన్ ద్వారా కోత కోయిస్తున్నాను నాకు రెండు ఎకరాల పొలం ఉంది. మరో నాలుగు ఎకరాలు కౌలుకు చేస్తున్నాను. కూలీల ద్వారా అయితే ఎకరాకి కోతకు, మోతకు, నూర్పుకు రూ.15 వేలు అయ్యేది. ఇప్పడు రూ. 3500 సరిపోతోంది.
– ఎస్. సత్యారావు, రైతు, పెదవేమలి గ్రామం
వ్యవసాయంలో యాంత్రీకరణ


