అంతర్జాతీయ స్థాయిలో బాగెంపేట యువకుడి సత్తా
● శ్రీలంకలో జరిగిన ఫైనల్స్‌లో పారాత్రోబాల్ జట్టులో కీలక ప్రదర్శన
వంగర: మండల పరిధి బాగెంపేట గ్రామానికి చెందిన బేపల పవన్‌కుమార్ పారాత్రోబాల్ విభాగంలో సత్తాచాటాడు. రాష్ట్రస్ఙాయి, జాతీయస్థాయి జట్టులో స్థానం సంపాదించి ప్రతిభకనబరచడంతో ఇండియా జట్టుకు ఎంపికయ్యాడు. ఈ నెల 4వ తేదీ నుంచి 10 వ తేదీ వరకు శ్రీలంక దేశంలోని రత్నపూర్ నగరంలో జరిగిన సౌత్ ఏషియన్ పారాత్రోబాల్ చాంపియన్‌షిప్ ట్రోఫీలో పాల్గొన్నాడు. బంగ్లాదేశ్, నేపాల్, భూఠాన్ దేశాలతో తలపడి అక్కడే జరిగిన ఫైనల్స్‌లో భారత జట్టు ద్వితీయ స్థానంలో నిలిచింది. 21 ఏళ్ల యువ క్రీడాకారుడు తనదైన అద్భుత ప్రదర్శన చూపడంతో అక్కడి నిర్వాహకులు ప్రత్యేక మెమెంటో అందించారు. ఇంటర్ విద్య పూర్తి చేసుకున్న తరువాత ఈ క్రీడపై ప్రత్యేక శ్రద్ధ వహించాడు. కొంతకాలంగా తమిళనాడులో పారాత్రోబాల్ విభాగంలో శిక్షణ పొంది ఇండియా జట్టు తరఫున శ్రీలంక వెళ్లి జట్టులో రాణించాడు. తల్లిదండ్రులు ఝంగం, మంగమ్మలు, గ్రామ పెద్దలు ఈ సందర్భంగా యువకుడిని అభినందించారు.
అంతర్జాతీయ స్థాయిలో బాగెంపేట యువకుడి సత్తా


