ప్రణాళికాబద్ధంగా పరీక్షలకు సన్నద్ధం
● అంబేడ్కర్ గురుకులాల జిల్లా కన్వీనర్ మాణిక్యం
రేగిడి: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న పది, ఇంటర్ విద్యార్థులను పబ్లిక్ పరీక్షలకు ప్రణాళికా బద్ధంగా సిద్ధం చేయాలని గురుకులాల జిల్లా కన్వీనర్ ఎం.మాణిక్యం అన్నారు. ఈ మేరకు బుధవారం ఆమె మండల పరిధి ఉంగరాడమెట్టలో ఉన్న డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ బాలుర గురుకులంలో విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల పరిధిలో ఉన్న ప్రిన్సిపాల్స్‌కు ఒక్కరోజు వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పదోతరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించడానికి విద్యార్ధులకు ఇప్పటి నుంచే తగిన తర్ఫీదునివ్వాలని సూచించారు. గురుకులాల్లో ప్రతి తరగతిలో శతశాతం ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు ప్రణాళికా బద్ధంగా పాఠ్యాంశాల బోధన చేయాలని హితవు పలికారు. పాత ప్రశ్నపత్రాలను ఎంపిక చేసుకుని తరచూ వస్తున్న ప్రశ్నలను గుర్తించి అటువంటి ప్రశ్నలకు వెనుకబడి ఉన్న విద్యార్థుల బోధనలో ప్రత్యేక అవగాహన కల్పించాలని కోరారు. రెండు జిల్లాల్లో బాలురు–5, బాలికలు–8 గురుకులాలున్నాయి. వాటిలో పదోతరగతిలో ఈ ఏడాది 911 మంది విద్యార్ధులు, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం 639 మంది, ద్వితీయ సంవత్సరంలో 653 మంది విద్యార్ధులు పరీక్షలు రాయనున్నారని ఆమె వెల్లడించారు. అనంతరం డార్మిటరీ, వంటగది, తరగతి గదులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ పి.రఘురామనాయుడు, వైస్‌ప్రిన్సిపాల్ డి.సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.


