నిర్లక్ష్య పాలనలో రైతాంగం అష్టకష్టాలు
● ప్రభుత్వంపై సీపీఐ తీవ్ర ఆగ్రహం
విజయనగరం గంటస్తంభం: రాష్ట్రప్రభుత్వం రైతాంగ సమస్యలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని సీపీఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద బుధవారం బరిగిన నిరసనలో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం ప్రకటించిన మద్దతు ధరతో పాటు రాష్ట్ర ప్రభుత్వం బోనస్ కలిపి ధాన్యం, మొక్కజొన్న, పత్తి పంటలను వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పి.కామేశ్వరరావు, జిల్లా నాయకులు బుగత అశోక్, రంగరాజు, ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి డేగల అప్పలరాజు రైతుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లారు.అనంతరం ఇన్‌చార్జ్ డీఆర్‌ఓ నూకరాజుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పి.కామేశ్వరరావు మాట్లాడుతూ, ఖరీఫ్‌లో 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని, కోట్లలో గోనెసంచులు సిద్ధం చేస్తామని ప్రభుత్వం చెప్పినా, చేతల్లో మాత్రం నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని విమర్శించారు. రైతులకు గోనెసంచుల కొరత తీవ్రంగా ఉందన్నారు. తేమశాతం రంగు, రప్పలు ఉన్నాయంటూ కొనుగోలు కేంద్రాల్లో అనవసర ఇబ్బందులు పెడుతున్నారని, పంటను ఆరబెట్టుకునే స్థలాలు కూడా ఇవ్వకపోవడం రైతులకు పెద్ద సమస్యగా మారిందన్నారు. అధికారులు, మిల్లర్లు కుమ్మకై ్క దళారులకు ధాన్యం వెళ్లేలా చూస్తున్నారని, దీంతో 75 కేజీల బస్తాపై రూ.400 రూ.500 నష్టం రైతులపై పడుతోందన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి ఒమ్మి రమణ, ఎఐకేఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి డేగల అప్పలరాజు మాట్లాడుతూ, మొక్కజొన్న, పత్తి, అరటి రైతుల పరిస్థితి దయనీయమని, మద్దతు ధరలు ప్రకటించినా మార్కెట్‌లో రైతులకు తక్కువ ధరలే లభిస్తున్నాయన్నారు.


