మరువాడలో చిన్నారికి స్క్రబ్‌టైఫస్ పాజిటివ్
బొండపల్లి: మండలంలోని మరువాడ గ్రామానికి చెందిన మూడేళ్ల చిన్నారికి స్క్రబ్ టైఫస్ పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ పాజిటివ్ కేసుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన నీలం కాన్వి ప్రియ(3)కు మూడు రోజుల క్రితం జర్వం రావడంతో చిన్నారి తండ్రి నాగరాజు జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తీసుకు వెళ్లగా వైద్యులు పరీక్ష చేసి స్క్రబ్ టైఫస్‌పాజిటివ్‌గా నిర్ధారించారు. వైద్యం కోసం చేరాలని అక్కడి వైద్యులు సూచించగా తమకు డబ్బు పెట్టే స్థోమత లేదని చెప్పి గజపతినగరం ఏరియా ఆస్పత్రిలో మంగళవారం ఉదయం చేర్పించారు. ఆస్పత్రి వైద్యుడు ప్రవీణ్ వైద్య పరీక్షలు చేసి మరోసారి పరిక్షలు (ఎలిషా) చేయాలని సూచించడంతో జిల్లా కేంద్రంలోని మహారాజా ఆస్పత్రికి రక్త నమూనాలు తీసుకువెళ్లి పరీక్ష నిర్వహించగా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. చిన్నారి ఒంటిపై స్క్రబ్ టైఫస్ లక్షణాలు ఏవీ లేనప్పటికీ పాజిటివ్ రావడంతో ఏరియా ఆస్పత్రిలోనే వైద్య సేవలు అందిస్తున్నారు. ప్రసుత్తం చిన్నారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో గ్రామంలో క్లోరినేషన్ చేయడంతో పాటు బ్లీచింగ్‌ను చల్లి, గ్రామస్తులను అప్రమత్తం చేసే పనిలో అధికారులు, వైద్య సిబ్బంది నిమగ్నమయ్యారు.


