ఎక్కడి ధాన్యం అక్కడే..!
● ధాన్యం అమ్మకంలో రైతుకు తప్పని తిప్పలు
● సంపత్, 1064 రకాల కొనుగోలుకు మిల్లర్లు ససేమిరా..
● అదనంగా 10 కిలోలు డిమాండ్
రామభద్రపురంలోని ఓ మిల్లు వద్ద ధాన్యం దించకపోవడంతో జాతీయ
రహదారికి ఇరువైపులా బారులు తీరిన ధాన్యం లోడులతో ఉన్న ట్రాక్టర్లు
రామభద్రపురం: వరి పండించిన రైతులకు తిప్పలు తప్పడం లేదు. ధాన్యం కొనుగోలులో మిల్లర్ల ఇబ్బందులు శాపంగా మారాయి. సంపత్, 1064 రకాలు ముక్క అవుతున్నాయని, బస్తాకు 10 కిలోలు అదనంగా ఇస్తేనే కొనుగోలు చేస్తామంటూ మిల్లర్లు తెగేసి చెప్పడం, ఆయా రకాలను మిల్లుల వద్ద దింపేందుకు ఆసక్తి చూపకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ధాన్యం లోడ్‌చేసిన ట్రాక్టర్లు రోజుల తరబడి మిల్లువద్దనే ఉంచాల్సిన దుస్థితి నెలకొంది. ట్రాక్టర్ అద్దె చార్జీలు రైతుకు తడిసిమోపెడవుతున్నాయి. పొరుగు రాష్ట్రం ధాన్యం కొనుగోలుపై ఉన్న ఆసక్తి స్థానికంగా రైతులు పండించిన ధాన్యం కొనుగోలులో మిల్లర్లు చూపడంలేదని రైతులు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా మిల్లర్లు సైతం తమ సమస్యలను బహిరంగంగా చెబుతున్నారు. బియ్యం మరపట్టించి ఇచ్చినందుకు మిల్లర్లకు ప్రభుత్వం ఇచ్చే కమీషన్లలో కొందరు అధికారులు కాజేస్తున్నారని, గతంలో 2 శాతం ఉంటే ఇప్పుడు 8 శాతం డిమాండ్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. మరోవైపు ముక్క అయిన బియ్యం తీసుకోవడంలేదని, నష్టపోతున్నామని వాపోతున్నారు.
చిత్రంలో మిల్లుకు తరలించేందుకు సిద్ధం చేసిన ధాన్యం రామభద్రపురం మండలంలోని ఆరికతోట గ్రామానికి చెందిన బూస ఎరకయ్యవి. ఆర్‌ఎస్‌కే సిబ్బంది ట్రక్ షీట్ ఇచ్చారు. తీరా మిల్లు వద్దకు వెళితే కొద్దిరోజులు ఆగాలని చెబుతున్నారు. చేసేదిలేక ధాన్యం బస్తాలను పొలంలోనే ఉంచి చలిలో కాపలాకాస్తున్నాడు.
ఎక్కడి ధాన్యం అక్కడే..!
ఎక్కడి ధాన్యం అక్కడే..!


