ధాన్యం సేకరణలో తప్పిదాలు జరగనీయొద్దు
● జేసీ సేతుమాధవన్
విజయనగరం అర్బన్: ధాన్యం సేకరణ ప్రక్రియలో ఎటువంటి తప్పిదాలు జరగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని జేసీ సేతుమాధవన్ అధికారులను ఆదేశించారు. రెవెన్యూ, వ్యవసాయ, మండల పరిషత్ అధికారులతో శుక్రవారం నిర్వహించిన వర్చువల్ సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ ఖరీఫ్ సీజన్‌లో జిల్లాకు 1,23,472 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా నిర్ణయించగా, ఇప్పటి వరకు 1,08,687 మెట్రిక్ టన్నుల సేకరణ పూర్తయిందని, కొనుగోలు కేంద్రాల ద్వారా 17,578 మంది రైతుల నుంచి ధాన్యం సేకరించినట్టు జేసీ తెలిపారు. రైతులకు ఇప్పటివరకు రూ.185.93 కోట్ల చెల్లింపులు జరిగాయని, బ్యాంకుల నుంచి రూ.172,84 కోట్ల బ్యాంకు గ్యారెంటీలు అందాయని వివరించారు. అవసరమైన గన్నీ సంచలు అందుబాటులో ఉంచాలని పౌరసరఫరాల డిప్యూటీ మేనేజర్‌ను ఆదేశించారు, బ్యాంకు గ్యారెంటీలు సమర్పించని మిల్లులను డీ–ట్యాగ్ చేయాలన్నారు. ఇప్పటికే అలాంటి మిల్లర్లకు నోటీసులు జారీచేశామని చెప్పారు.


