సంతకాల ఉద్యమం విజయవంతం
చీపురుపల్లిరూరల్(గరివిడి): ప్రభత్వు మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని చంద్రబాబు ప్రభుత్వం వెనక్కి తీసుకునే వరకు పోరాటం ఆగదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షు డు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనువాసరావు, మాజీఎంపీ బెల్లాన చంద్రశేఖర్ స్పష్టంచేశారు. గరివిడిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో స్థానిక విలేకరులతో వారు మంగళవారం మాట్లాడారు. గత వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో జగన్‌మోహన్‌రెడ్డి 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలలను తీసుకువస్తే.. ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం వాటిని ప్రైవేటుపరం చేసేందుకు పూనుకుందన్నారు. దీనిని వ్యతిరేకిస్తూ ప్రజల తరఫున ప్రతిపక్షపార్టీ బాధ్యతగా కోటి సంతకాల సేకరణ చేసి గవర్నర్‌కు అందజేయాలని మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో సంతకాల ఉద్యమానికి శ్రీకారం చుట్టిందన్నారు. చీపురుపల్లి నియోజకవర్గంలో 50వేల సంతకాలు పైబడి సంతకాల సేకరణ సాగిందన్నారు. ఈనెల 10న నియోజకవర్గ స్థాయిలో చీపురుపల్లి మూడు రోడ్లు కూడలి వద్ద రాష్ట్ర శాసనమండలి విపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ ఉదయం 10 గంటలకు సంతకాల సేకరణ బాక్సులతో ఉన్న వాహనాన్ని లాంఛనంగా ప్రారంబిస్తారని తెలిపారు. మూడు రోడ్ల కూడలి నుంచి ఆంజనేయపురంలోని ఆంజనేయస్వామి ఆలయం వరకు పెద్ద ఎత్తున ర్యాలీగా వెళ్లి అనంతరం పార్టీ జిల్లా కార్యాలయానికి సంతకాల సేకరణ బాక్సులను అందజేస్తారన్నారు. జిల్లాలోని 7 నియోజకవర్గాల్లోనూ సంతకాల ప్రతులతో ర్యాలీలు సాగుతాయని తెలిపారు. ఈ నెల 15న జిల్లా కేంద్రంలో తలపెట్టిన సంతకాల ప్రతుల ప్రదర్శన కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న పార్టీ శ్రేణులు, ప్రజలు, యువత పాల్గొనాలని పిలుపునిచ్చారు. ప్రైవేటీకరణ వల్ల ప్రజలకు ఎంత నష్టం జరుగుతుందో విమానయానంలో ఇటీవల చోటుచేసుకున్న ఘటనలే నిలువెత్తు నిదర్శనమన్నారు. రాబోయే రోజుల్లో మెడికల్ కళాశాలల్లో కూడా అదే పరిస్థితి ఎదురవుతుందన్నారు. విమానయాన శాఖను సమర్థవంతంగా నిర్వహించలేక మంత్రి రామ్మోహన్‌నాయుడు తెలుగువారి పరువును తీసివేశారన్నారు. కార్యక్రమంలో బొత్స అనూష, వైఎస్సార్‌సీపీ నాయకుడు కె.వి.సూర్యనారాయణరాజు, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ ఎస్.వి.రమణరాజు, నాయకులు మీసాల విశ్వేశ్వరరావు, వాకాడ శ్రీనివాసరావు, కొణిశ కృష్ణంనాయడు, చీపురుపల్లి మండల నాయకులు ఇప్పిలి అనంతం, వలిరెడ్డి శ్రీనివాసులనాయుడు, మీసాల వరహాలనాయుడు, బెల్లాన వంశీకృష్ణ, గుర్ల మండల నాయకులు సీర అప్పలనాయుడు, పొట్నూరు సన్యాసినాయుడు, తోట తిరుపతిరావు, మెరకముడిదాం మండల నాయకులు తాడ్డి వేణుగోపాలరావు, కోట్ల విశ్వేశ్వరరావు, నాలుగు మండలాలకు చెందిన సర్పంచులు, ఎంపీటీసీలు, మాజీ పీఏసీఎస్ అధ్యక్షులు పాల్గొన్నారు.
సాక్షిప్రతినిధి, విజయనగరం:
ప్రభుత్వ వైద్యకళాశాలల పరిరక్షణకు వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు పార్టీ నాయకులు జిల్లాలో చేపట్టిన కోటి సంతకాల ఉద్యమం విజయవంతమైంది. జిల్లా వ్యాప్తంగా విద్యార్థుల నుంచి వృద్ధుల వరకు సంతకాల కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. భవిష్యత్తు తరాల కోసం ఈ సంతకం ఉపయోగపడాలని ఆకాంక్షించారు. చంద్రబాబు ప్రభుత్వ నిరంకుశత్వపాలనపై సంతకంతో నిరసన తెలిపారు. సంతకాల ప్రతులను గవర్నర్‌కు అందజేసి ప్రభుత్వ మెడికల్ కళాశాలలను కాపాడాలని వైఎస్సార్‌సీపీ నేతలను కోరారు. ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ఇచ్చారు.
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. దేశంలో ఎక్కడాలేని విధంగా 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలలను రాస్ట్రానికి తీసుకువచ్చిన విషయం విదితమే. 2023–24 కాలంలోనే ఇందులో ఐదు కళాశాలలను ప్రారంభించారు. అందులో విజయనగరం ప్రభుత్వ వైద్యకళాశాల ఒకటి. మిగిలిన కళాశాలలు వివిధ దశల్లో ఉన్నాయి. పార్వతీపురం మన్యం జిల్లా వంటి వెనుకబడిన గిరిజన ప్రాంతంలోనూ ప్రభుత్వ వైద్యకళాశాల ఆవశ్యకతను నాటి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి గుర్తించి.. రూ.600 కోట్లతో కళాశాల మంజూరు చేశారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. ప్రజా ప్రయోజనాలను కాదని, కేవలం రాజకీయ కక్షతో వీటికి మంగళం పాడింది. తన బాధ్యత నుంచి తప్పుకుని, పీపీపీ విధానంలోని వీటిని ప్రైవేటుకు కట్టబెట్టేందుకు సిద్ధమైంది. ఇదే జరిగితే పేద విద్యార్థులకు వైద్యవిద్యను అభ్యసించాలన్న కల నెరవేరకుండా పోతోంది. పేదలకు, గిరిజనులకు జిల్లాలోనే ఉచితంగా మెరుగైన వైద్యసేవలు అందని పరిస్థితి.
ప్రభుత్వ వైద్యకళాశాలలను ప్రైవేట్‌పరం చేయడాన్ని వైఎస్సార్‌సీపీ తీవ్రంగా ఖండించింది. పార్టీ అధినేత జగన్ ఆదేశాల మేరకు ప్రజాఉద్యమానికి పార్టీ నేతలు సిద్ధమయ్యారు. జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లోను సంతకాల సేకరణకు శ్రీకారం చుట్టారు. శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు, మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, మాజీ ఎమ్మెల్యేలు బడ్డుకొండ అప్పలనాయుడు, శంబంగి వెంకట చిన అప్పలనాయుడు, బొత్స అప్పలనరసయ్య, కడుబండి శ్రీనివాసరావు, పార్టీ రాజాం నియోజకవర్గ సమన్వయకర్త తలే రాజేష్, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, పార్టీ నేతలు సంతకాల ఉద్యమంలో స్వయంగా పాల్గొన్నారు. వైద్యకళాశాలల ఆవశ్యకతను వివరించారు. చంద్రబాబు దుర్మార్గపు పాలనను విడమర్చిచెప్పారు. ప్రజల మద్దతు కోరుతూ, కోటి సంతకాల సేకరణ చేపట్టి రాష్ట్ర గవర్నర్‌కు అందజేయాలని నిర్ణయించారు. అక్టోబర్‌లో రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ నెల 3వ తేదీ వరకు జిల్లాలోని ఒక్కో నియోజకవర్గంలో 60 వేల పైచిలుకు సంతకాలను సేకరించారు. ఈ నెల 10న సంతకాల ప్రతులను ప్రత్యేక వాహనాల ద్వారా జిల్లా కేంద్రాలకు తరలించనున్నారు. అనంతరం 15వ తేదీన జిల్లా కేంద్రం నుంచి పార్టీ కేంద్ర కార్యాలయానికి తరలిస్తారు. అక్కడి నుంచి ఈ నెల 17న గవర్నర్ వద్దకు వెళ్లి ప్రజాభిప్రాయాన్ని అందజేయనున్నారు.
ప్రజల పక్షాన నిలిచిన వైఎస్సార్‌సీపీ
జిల్లాలో వైఎస్సార్‌సీపీ కోటి సంతకాల సేకరణ విజయవంతం
ప్రభుత్వ వైద్యకళాశాల పరిరక్షణకు ప్రజల నుంచి విశేష మద్దతు
ఒక్కో నియోజకవర్గంలో 60 వేలకుపైగా సంతకాల సేకరణ
17న గవర్నర్ వద్దకు..
సంతకాల ఉద్యమం విజయవంతం
సంతకాల ఉద్యమం విజయవంతం


