ఆర్థిక బలోపేతమే ప్రధానం
● డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాసపాణి
రేగిడి: స్వయంశక్తి సంఘాల మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలని వెలుగు పీడీ శ్రీనివాసపాణి అన్నారు. రేగిడి మండలంలోని ఐఏపీ కార్యాలయంలో స్వయంశక్తి సంఘాల మహిళలకు జరుగుతున్న శిక్షణ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా పీడీ మాట్లాడుతూ రాబోయే ఐదేళ్లలో సంస్థను బలోపేతానికి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. స్వయంసహాయక సంఘాల మహిళలు బ్యాంకు రుణాలను సక్రమంగా చెల్లించాలన్నారు. వీఓఏలు, గ్రామసంఘ అధ్యక్షులు మరింత బాధ్యతగా పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో ఏపీఎం బి.గోవిందరావు, ఎల్.సి.వెంకటరావు, తదితరులు పాల్గొన్నారు.
అల్లూరి డీఈఓగా రామకృష్ణారావు
నెల్లిమర్ల: అల్లూరి సీతారామరాజు జిల్లా విద్యాశాఖాధికారిగా కె.రామకృష్ణారావును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన విజయనగరం డైట్‌కళాశాల ప్రిన్సిపాల్(ఎఫ్‌ఎసీ)గా పనిచేస్తూ ఉద్యోగోన్నతిపై డీఈఓగా నియామకమయ్యారు. ఆయనను డైట్ సిబ్బంది అభినందించారు.
మెరుగైన విద్యాబోధన అందించాలి
నెల్లిమర్ల: ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన అందించాలని పాఠశాల విద్యాశాఖ రీజనల్ డైరెక్టర్ కె.విజయభాస్కర్ సూచించారు. నగర పంచాయతీ పరిధిలోని జరజాపుపేట ఉన్నత పాఠశాలలో మంగళవారం నిర్వహించిన టీచ్‌టూల్ శిక్షణను ఆయన పరిశీలించారు. శిక్షణకు సంబంధించి ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధించాలన్నారు. కార్యక్రమంలో ఎంఈఓలు సూర్యనారాయణమూర్తి, జ్ఞానశంకర్, తదితరులు పాల్గొన్నారు.
వైద్య సదుపాయాలు మెరుగుపర్చాలి
● కలెక్టర్ రాంసుందర్ రెడ్డి
విజయనగరం ఫోర్ట్: ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి, అనుబంధ ఘోషా ఆస్పత్రిలో వైద్య సదుపాయాలు మెరుగుపర్చేందుకు, అదనపు వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి వైద్యాధికారులకు సూచించారు. విజయనగరం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో మంగళవారం నిర్వహించిన ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశం (హెచ్‌డీఎస్)లో ఆయన మాట్లాడారు. హెచ్‌డీఎస్ ఫండ్స్ రూ.7కోట్లు వరకు ఉందని, ఆస్పత్రిలో సౌకర్యాలు మెరుగుపర్చేందుకు వినియోగించాలని ఆదేశించారు. అత్యవసర వైద్య పరికరాలను వెంటనే కొనుగోలు చేయాలని సూచించారు. భవనాలు, ఇతర మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాలన్నారు. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో అత్యవసర విభాగాలను గాజులరేగ సమీపంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలోకి తరలించేందుకు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిస్తామని చెప్పా రు. ఆస్పత్రికి కొత్తగా ఒక లైఫ్ సపోర్టు అంబులెన్సు సమకూర్చేందుకు, సీవేజ్ ట్రీటెమెంట్‌ప్లాంట్ నిర్మాణం, నెఫ్రాలజీ విభాగంలో డయాలసిస్ యూనిట్, దానికి అనుబంధంగా ఆర్వో ప్లాంటు, దినసరి వేతనంపై ఇద్దరు క్షరకుల నియామకం, జనరిక్ మందుల షాపు ఏర్పాటు, ఘోషా ఆస్పత్రిలో పలు భవనాల నిర్మాణం, 15 సీసీ కెమెరాల ఏర్పాటు, రూ.20 లక్షల విలువైన డయా థెర్మీ పరికరం ఏర్పాటు, వివిధ ధ్రువపత్రాల చార్జీల పెంపు, డేటా ఎంట్రీ ఆపరేటర్ల నియామకం, వేతనాల పెంపుపై చర్చించి ఆమోదించారు. విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు మాట్లాడుతూ ఆస్పత్రిలో రోగులకు వసతి సరిపోవడం లేదని, అందువల్ల తక్షణమే డీసీహెచ్‌ఎస్ కార్యాలయాన్ని తరలించాలన్నారు. సమావేశంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ అల్లు పద్మజ, ఇన్‌చార్జి డీఎంహెచ్‌ఓ రాణి, డీసీహెచ్‌ఎస్ పద్మశ్రీ రాణి, ఎంపీహెచ్‌ఎంఐడీసీ భారతి, మున్సిపల్ కమిషనర్ నల్లనయ్య, కో ఆప్సన్ సభ్యులు జయ చంద్రనాయుడు, వి.అశోక్, ఇమ్మడి సుధీర్, అనూరాధ బేగం, తదితరులు పాల్గొన్నారు.
ఆర్థిక బలోపేతమే ప్రధానం


