చంద్రబాబు పాలనపై విరక్తి చెంది...
విజయనగరం:
ఎన్నికలకు ముందు అమలు సాధ్యంకాని హమీలు గుప్పించడం, అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలను మోసగించడమే పరమావధిగా పెట్టుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాలనపై విరక్తి చెందిన నాయకులు, కార్యకర్తలు టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలో చేరడం శుభపరిణామమని ఏపీ శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్, వైఎస్సార్‌సీపీ కేంద్ర కమిటీ సభ్యుడు కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. తన నివాసంలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో 50వ డివిజన్ కార్పొరేటర్ పట్టా ఆదిలక్ష్మి ఆధ్వర్యంలో టీడీపీ పట్టణ మాజీ ఎస్సీసెల్ కమిటీ ప్రధాన కార్యదర్శి సియ్యాదుల చంద్రశేఖర్‌తో పాటు 20 కుటుంబాలు వైఎస్సార్‌సీపీలో చేరాయి. వీరికి పార్టీ కండువాలు వేసి కోలగట్ల సాదరంగా ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికార టీడీపీకి చెందిన నాయకులు వైఎస్సార్‌సీపీలో చేరుతున్నారంటే చంద్రబాబు ప్రభుత్వం తీరును తేటతెల్లం చేస్తోందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలుచేయకపోవడంతో ప్రజల్లో వ్యతిరేకత మొదలైందన్నారు. చంద్రబాబు మాయమాటలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. సంక్రాంతి అనంతరం నగరంలో విస్తృత పర్యటనలు నిర్వహించి పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని, భవిష్యత్‌లో మరింత మంది అధికార టీడీపీని వీడి వైఎస్సార్‌సీపీలో చేరనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ యువజన విభాగం నాయకుడు జి.ఈశ్వర్‌కౌశిక్, కార్పొరేటర్లు బోనెల ధనలక్ష్మి, పట్నాన పైడిరాజు, ఆదినారాయణ, పార్టీ నగర ప్రధాన కార్యదర్శి జె.శ్రీను, 49వ డివిజన్ ఇన్‌చార్జి కనుగల రాజా, నగర వాణిజ్య విభాగం అధ్యక్షుడు జమ్ము మధు, తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీలో చేరిన 50వ డివిజన్ వాసులు
పార్టీ కండువాలు వేసి స్వాగతం పలికిన మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి


