8వ తేదీ వచ్చినా జీతాల్లేవు
● రెండు శాఖల ఉద్యోగులు మినహా మిగిలిన వారికి అందని జీతం
విజయనగరం అర్బన్:
‘వ్యవసాయ శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఓ వ్యక్తి జిల్లా కేంద్రంలో కట్టుకున్న ఇల్లుకోసం బ్యాంకు రుణం తీసుకున్నారు. రుణం నెలవారీ వాయిదా మొత్తం 5వ తేదీలోపు జీతం నుంచి జమచేసుకోవాలని బ్యాంకుతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇప్పుడు 8వ తేదీ వచ్చినా జీతం జమకాకపోవడంతో అకౌంట్ బౌన్స్ చార్జీలతో పాటు సెబీ విలువ పడిపోయి డిఫాల్టర్‌గా మారిపోయాడు.’ ఇది ఒక వ్యవసాయ శాఖ ఉద్యోగి సమస్యేకాదు. విద్య, పోలీస్ శాఖ ఉద్యోగులు మినహా జిల్లాలోని మిగిలిన అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది ఎదుర్కొంటున్న పరిస్థితి అని ఆయన వాపోయాడు.
‘గత ప్రభుత్వం జీతాలు వేయడంలో రెండుమూడురోజులు ఆలస్యం అయినా అన్ని శాఖల ఉద్యోగ, అధికారులకు ఒకేసారి వేసేది. ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం ఉద్యోగులు అధికంగా ఉన్న విద్యాశాఖ, పొలీసు శాఖల ఉద్యోగులకు ముందుగా వేసి మిగిలిన శాఖల ఉద్యోగులకు పదోతేదీ దాటాక వేస్తోంది. అత్యవసర శాఖల ఉద్యోగులకు తొలుత వేయాలంటూ చెబుతున్న ప్రభుత్వం మిగిలిన శాఖల ఉద్యోగుల కుటుంబాలకు వేతనాలు అవసరం లేదా..? ఉద్యోగుల మధ్య ప్రభుత్వం వివక్షత చూపడం సరికాదు.’ అంటూ వేతనాలు ఇప్పటికీ పడని ఓ ఆర్‌అండ్‌బీ ఉద్యోగి ఆవేదన ఇది.
అంతన్నారు.. ఇంతన్నారు... ప్రజాసంక్షేమ పథకాలను పక్కనపెట్టేశారు. కనీసం ఉద్యోగుల జీతాలను కూడా ఒకటో తేదీన చెల్లించలేని దుస్థితిలో చంద్రబాబు సర్కారు ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రెండేళ్లలో లక్షలకోట్ల రూపాయలు అప్పుడుచేసిన సర్కారు... జీతాల చెల్లింపులో జాప్యంపై ఉద్యోగవర్గాలు మండిపడుతున్నాయి. జీతాల చెల్లింపులో వివక్ష చూపడాన్ని ఖండిస్తున్నాయి. 8వ తేదీ ముగిసినా జీతాలు చెల్లించకపోవడంపై ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. ఉమ్మడి విజయనగరం జిల్లాలో వివిధ విభాగాల్లో సుమారు 57 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు పనిచేస్తున్నారు. వారిలో దాదాపు 24 వేల మంది వరకు ఉన్న టీచర్లు, పోలీస్ ఉద్యోగులకు మాత్రమే జీతాలు వేశారు. మిగిలిన వివిధ శాఖల సిబ్బందికి వేతనాలు పడలేదు. జీతాల చెల్లింపులో ఆలస్యంపై ఆయా ఉద్యోగవర్గాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. ఓటేసిన పాపానికి అనుభవిస్తున్నా మంటూ మదనపడుతున్నాయి.


